Begin typing your search above and press return to search.

కిట‌కిట‌లాడిన హైద‌రాబాద్ మెట్రో..ఇంత‌లా ఇదే ఫ‌స్ట్ టైమ్!

By:  Tupaki Desk   |   22 Jun 2019 5:17 AM GMT
కిట‌కిట‌లాడిన హైద‌రాబాద్ మెట్రో..ఇంత‌లా ఇదే ఫ‌స్ట్ టైమ్!
X
శుక్ర‌వారం సాయంత్రంతో మొద‌ల‌వుతుంది వీకెండ్‌. అన్ని వీకెండ్లు ఒకేలా ఉండ‌వ‌న్న‌ట్లు నిన్న‌టి వీకెండ్ హైద‌రాబాద్ వాసుల‌కు కొత్త అనుభ‌వాన్ని మిగిల్చింది. జోరున కురిసిన వ‌ర్షం.. రోడ్ల మీద ఆగిన నీళ్ల‌తో వాహ‌నాలు ముందుకు క‌ద‌ల్లేని ప‌రిస్థితి. దీంతో.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం నెల‌కొంది. గంట‌ల త‌ర‌బ‌డి సాగిన జాం స‌మ‌స్య‌కు ప‌రిష్కారంగా హైద‌రాబాద్ మెట్రో నిలిచింది.

హైటెక్ సిటీ ప్రాంతంలోని మెట్రో స్టేష‌న్ల‌లో ఐటీజీవులు విర‌గ‌బ‌డ్డారు. స్టేష‌న్లు మొత్తం కిటకిట‌లాడాయి. ఒక‌ద‌శ‌లో వ‌స్తున్న ర‌ద్దీని కంట్రోల్ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఊహించ‌నంత ర‌ద్దీ ఒక్క‌సారిగా విరుచుకుప‌డ‌టంతో తొలిసారి హైద‌రాబాద్ మెట్రో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. శుక్ర‌వారం సాయంత్రం ఆరు గంట‌ల‌కు మొద‌లైన ఈ ర‌ద్దీ రాత్రి ప‌ద‌కొండు గంట‌ల వ‌ర‌కూ సాగుతూనే ఉంది.

న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల‌కు వెళ్లే ఐటీ ఉద్యోగులంతా త‌మ గ‌మ్య‌స్థానాలు చేరుకోవ‌టానికి మెట్రోను ఆశ్ర‌యించారు. దీంతో.. మెట్రో స్టేష‌న్లు కిట‌కిట‌లాడాయి. తామింత ర‌ద్దీని ఊహించ‌లేద‌న్న మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. అద‌న‌పు రైళ్ల‌ను న‌డ‌ప‌ట‌మే కాదు.. ర‌ద్దీ వేళ‌లో మెట్రో సిబ్బంది మ‌రింత చురుగ్గా వ్య‌వ‌హ‌రించేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. రాత్రివేళ‌లో స‌ర్వీసుల్ని పెద్ద ఎత్తున న‌డిపే ప్ర‌య‌త్నం చేసి.. ప్ర‌యాణికుల వెత‌ల్ని తీర్చారు. హైటెక్ సిటీకి మెట్రో కాని లేకుంటే నిన్న రాత్రి (శుక్ర‌వారం) ఐటీ కారిడార్ లోని వారికి కాళ‌రాత్రి అయ్యేద‌న‌టంలో సందేహం లేదు.