Begin typing your search above and press return to search.

విశ్వనగరం.. వర్షానికి అయ్యింది నరకం?

By:  Tupaki Desk   |   15 Oct 2020 12:30 AM GMT
విశ్వనగరం.. వర్షానికి అయ్యింది నరకం?
X
దేశంలోనే ప్రముఖ మెట్రో పాలిటన్ సిటీ. దాదాపు కోటి మంది ప్రజలను అక్కున చేర్చుకున్న మహానగరం. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంతో మంది వచ్చి హైదరాబాదీలుగా మారి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అన్యోన్యంగా జీవిస్తున్నారు. అలాంటి మహానగరం తాజాగా కుండపోత వర్షాలకు చిగురుటాకులా వణికిపోయింది.

హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న ఆంధ్రాలో తీరం దాటిన తుఫాన్ తెలంగాణలోనూ కుంభవృష్టి కురిపించింది. ముఖ్యంగా హైదరాబాద్ లో జలవిలయం సంభవించింది. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీవర్ష బీభత్సానికి చాంద్రాయణగుట్టలోని గౌన్ నగర్ లో రెండు ఇళ్లు కూలిపోయాయి. పాతబస్తీలో జరిగిన ఈ దుర్ఘటనలో 9మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇక కాలనీలన్నీ మునిగిపోయాయి. ఇళ్లన్నీ నడుం లోపు నీటిలో మునిగిపోయాయి. కార్లన్నీ బొమ్మల్లా నీటిలో తేలి వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ వర్షానికి హైదరాబాదీల బాధ నరకంగా మారింది. ఈ పాపం ఎవరిదని అందరూ నినదిస్తున్నారు.

విశ్వనగరమైన హైదరాబాద్ లో గజం స్థలం కూడా లక్షలు పలుకుతున్న పరిస్థితి. ఒక్క ఫ్లాట్ కావాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే. ఈ క్రమంలోనే గజం స్థలంను కూడా అక్రమార్కులు కబ్జాలు చేసేశారు. చెరువులు, నాలాలను మాయం చేసి ప్లాట్లుగా మార్చారు. ఫలితంగా వరద నీరు వెళ్లిపోవడానికి వీల్లేకుండా నగరం కాంక్రీట్ మయమైంది.

దీంతో భారీ వర్షాలకు నీళ్లు ఎటు పోవాలో తెలియక భాగ్యనగరాన్ని ముంచేసి అభాగ్యనగరంగా మార్చింది. విశ్వనగరం అని గొప్పలు చెప్పుకుంటున్న పాలకుల దిమ్మదిరిగేలా నిండా మునిగింది. చరిత్రలో చూడని విపత్తుగా మారింది. హైదరాబాద్ లో వర్ష బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో... జాతీయ స్థాయిలో వైరల్ అయ్యి అన్ని మీడియాల్లో పతాక శీర్షిక అయ్యాయి. హైదరాబాద్ మునగడానికి కారకులు ఎవరు అంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం వస్తే ఇలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం భారీ వర్షానికి హైదరాబాదీల బాధ వర్ణనాతీతంగా మారింది.