Begin typing your search above and press return to search.

ఇటలీలో మాదిరే.. ఇప్పుడు అమెరికాలోనూ..?

By:  Tupaki Desk   |   31 March 2020 7:30 PM GMT
ఇటలీలో మాదిరే.. ఇప్పుడు అమెరికాలోనూ..?
X
అది అగ్రరాజ్యం. ఆ మాటకు వస్తే ప్రపంచానికే పెద్దన్న. అలాంటి అమెరికాలో కరోనా లాంటి కంటికి కనిపించని ఒక వైరస్ కు ఆ దేశం ఎంతలా తల్లడిల్లిపోతుందన్న విషయాన్ని చెప్పే దారుణ ఉదంతాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఊహించని రీతిలో ఇటలీలో కరోనా విరుచుకుపడటం తెలిసిందే. అక్కడ పెరిగిపోయిన పాజిటివ్ కేసులతో అక్కడి యంత్రాంగం చేతులు ఎత్తేయటమే కాదు.. 70 ఏళ్లుదాటిన పెద్ద వయస్కులకు వైద్యం చేయరాదన్న తీవ్ర నిర్ణయం తీసుకున్న వైనానికి ప్రపంచమే నిర్ఘాంతపోయింది.

సంపన్న దేశంలో అలాంటి పరిస్థితా? అంటూ షాక్ తిన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికాలోనూ కరోనా శివాలెత్తిపోతోంది. న్యూయార్క్ మహానగరంలో ఇప్పుడు భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం కరోనాకే కేంద్రస్థానంగా న్యూయార్క్ మహానగరం మారింది. ఇక్కడ ప్రతి గంటకు కేసులు మారిపోతున్నాయి. సోమవారం సాయంత్రానికి.. ఆ ఒక్క రాష్ట్రంలోనే 60వేలకు పైగా కేసులు పెరిగాయి. దాదాపు వెయ్యి వరకూ మరణించినట్లుగా చెబుతున్నారు.

అమెరికా ఆర్థిక మూలాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే న్యూయార్క్ మహానగరంలో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. బతికే అవకాశం ఉన్న వారికి మాత్రమే ఆసుపత్రుల్లో బెడ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో.. ప్రపంచంలోనే సంపన్న దేశంగా ఉండే అమెరికాలో.. రోగం వచ్చిన వారికి బెడ్లు కూడా సమకూర్చలేని దుస్థితికి చేరుకుందా? అన్నది ఇప్పుడుక్వశ్చన్ గా మారింది.

ఇప్పుడున్న లెక్కల ప్రకారం అమెరికాలో వెంటిలేటర్లు కేవలం 2.5 లక్షలు మాత్రమే. ఇప్పుడుున్న పరిస్థితుల్లో ఆ దేశానికి తొమ్మిది లక్షల వెంటిలేటర్లు అవసరమవుతాయని చెబుతున్నారు. ఇలాంటివేళలో.. బతికి ఉండే వారికే అధిక ప్రాధాన్యత ఇస్తుండటం చూస్తే.. ఎలాంటి దేశం కరోనా కారణంగా మరెలా మారిందో అన్న భావన కలుగక మానదు.