Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నికలు..అభ్యర్థుల పరుగు అక్కడికే..

By:  Tupaki Desk   |   27 Oct 2018 3:30 PM GMT
తెలంగాణ ఎన్నికలు..అభ్యర్థుల పరుగు అక్కడికే..
X
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఎందుకు వచ్చాయంటే ప్రతిపక్ష కాంగ్రెస్ కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటోందని కేసీఆర్ అంటున్నారు. కానీ తెరవెనుక మాత్రం 2019లో కంటే 2018 డిసెంబర్ లోపు ఎన్నికలు జరిగితేనే కేసీఆర్ జాతకరీత్యా మళ్లీ సీఎం అవుతారని జోతిష్యులు చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఆ జాతకాలను బట్టే కేసీఆర్ ముందస్తుకు మొగ్గుచూపారని ప్రచారం చేశారు. ఏదీ నిజమో.. ఏదీ అబద్ధమో కానీ ముందస్తు ఎన్నికలు అయితే వచ్చాయి.

కేసీఆర్ కు సెంటిమెంట్ అక్షరం 6. దాని ప్రకారమే అసెంబ్లీ నవంబర్ 6న రద్దు చేసి 105మంది అభ్యర్థులను ప్రకటించారు. సంఖ్య కూడితే వచ్చేది 6 సంఖ్యనే. ఇలా తెలంగాణ ఎన్నికలను జ్యోతిష్యం మీదనే కేసీఆర్ ముందుకు నడిపించారని అందరికీ అర్థమైంది.

ఇక మహాకూటమి అభ్యర్థులు కూడా ఈ వారంలోనే తేలబోతున్నారు. వచ్చే నెల 12నుంచి నోటిఫికేషన్ తోపాటు నామినేషన్ల పర్వం కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే అధికారిక - ప్రతిపక్ష - స్వతంత్య్ర అభ్యర్థులందరూ తమ రాశిఫలాలు - జాతకాలకు విలువనిస్తూ ఏ రోజు నామినేషన్ వేయాలి.? నామినేషన్ కు ముందు పూజలు - బట్టలు ధరించాలని.. తదితర తంతును తెలుసుకోవడం కోసం ప్రముఖ జ్యోతిష్యుల వద్దకు క్యూ కడుతున్నారట.. తమ జాతక బలం ప్రకారం నవంబర్ 12 నుంచి 19 వరకు ఏ తేదీల్లో నామినేషన్ వేయాలో తెలుసుకుంటున్నారట.. కొందరు అభ్యర్థులు జాతకరీత్యా ఇబ్బంది ఉందని.. ఆ దోష నివారణకు పూజలు కూడా చేయించే పనిలో ఉన్నారని సమాచారం.

గెలుపు కోసం ప్రచారం చేయడంతోపాటు అనాధిగా వస్తున్న ఈ ఆచారాలను అభ్యర్థులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. తిథి - వార - నక్షత్రాలను బేరిజు వేసుకొని ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలా తెలంగాణ ముందస్తు ఎన్నికల బరిలో జ్యోతిష్యం కూడా పెద్ద పాత్రనే పోషిస్తోంది.