Begin typing your search above and press return to search.

థాయ్ లాండ్ కంటే వైజాగ్ కే టికెట్ ఎక్కువ‌!

By:  Tupaki Desk   |   11 Jan 2019 6:19 AM GMT
థాయ్ లాండ్ కంటే వైజాగ్ కే టికెట్ ఎక్కువ‌!
X
నిజ‌మా అన్న డౌట్ రావొచ్చు. కాదులే అని స‌ర్దిచెప్పుకోవ‌చ్చు. కానీ.. ఇది నిజం. తెలుగువారికి.. మ‌రి ముఖ్యంగా కోస్తా వారికి పెద్ద పండ‌గ అయిన సంక్రాంతి పుణ్య‌మా అని విమాన ఛార్జీలు చుక్క‌ల్ని తాకుతున్నాయి. డిమాండ్ ఆధారంగా మారే ధ‌ర‌ల పుణ్య‌మా అని ఇప్పుడు కోస్తా ప్రాంతంలోని వివిధ న‌గ‌రాల‌కు వెళ్లే విమాన టికెట్ల ధ‌ర‌ల‌తో పోలిస్తే.. స‌దూరాన ఉండే విదేశాల విమాన టికెట్లు చౌక‌గా మార‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ రోజు (జ‌న‌వ‌రి 11) థాయ్ లాండ్ కు వెళ్లాలంటే రూ.8900 ఖ‌ర్చు పెడితే టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయిపోతుంది. కానీ.. హైద‌రాబాద్‌ కు కాస్త దూరాన ఉండే విశాఖ‌ప‌ట్నానికి వెళ్లాలంటే ఏకంగా రూ.18,226 ఖ‌ర్చు పెడితే కానీ టికెట్ క‌న్ఫ‌ర్మ్ కాని ప‌రిస్థితి. ఒక్క థాయ్ లాండ్ టికెట్లు మాత్ర‌మే కాదు.. సింగ‌పూర్.. దుబాయ్ కు వెళ్లే ఫ్లైట్ల టికెట్లు చౌక‌గా ఉంటే.. ఆంధ్రా ప్రాంతంలోని విశాఖ‌.. రాజ‌మండ్రి.. విశాఖ.. తిరుప‌తి ప‌ట్ట‌ణాల‌కు వెళ్లే విమాన టికెట్ల ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి.

రేపు (జ‌న‌వ‌రి 12) థాయ్ వెళ్లాలంటే టికెట్ రూ.8900 ఉండ‌గా.. సింగ‌పూర్ వెళ్లాలంటే రూ.16,840 వ‌ర‌కూ ఉంది. అదే దుబాయ్ వెళ్లాలంటే రూ.16,952 ఖ‌ర్చు చేస్తే టికెట్ దొరికిపోయే ప‌రిస్థితి. అదే కోస్తాకు చెందిన విజ‌య‌వాడ‌కు వెళ్లాలంటే రూ.15వేలు పెడితే కానీ టికెట్ దొర‌క‌ని ప‌రిస్థితి. బెజ‌వాడ‌కు ద‌గ్గ‌ర్లో ఉండే రాజ‌మండ్రికి హైద‌రాబాద్ నుంచి విమానంలో వెళ్లాలంటే అక్ష‌రాల రూ.15 వేల వ‌ర‌కూ ఛార్జీ చెల్లించాల్సిందే.

ఇక‌.. విశాఖ‌కు వెళ్లాలంటే టికెట్ రూ.18,500 వ‌ర‌కు ఉంది. స‌దూరాన ఉండే విదేశం కంటే కూడా స్వ‌దేశం.. అందునా హైద‌రాబాద్‌ కు ద‌గ్గ‌ర్లోని కోస్తా ప‌ట్ట‌ణాల‌కు విమానంలో వెళ్లాలంటే వేలాది రూపాయిలు ఖ‌ర్చు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. బ‌స్సు ధ‌ర‌లు భారీగా ఉండ‌టం.. రైళ్ల‌లో రిజ‌ర్వ్ కోచ్ ల‌లో టికెట్లు లేక‌పోవ‌టంతో త‌క్కువ స‌మ‌యంలో ప్ర‌యాణం చేసి వెళ్లొచ్చ‌న్న వారికి.. భారీగా పెరిగి విమాన టికెట్ ధ‌ర‌లు ఇప్పుడు బెద‌ర‌గొడుతున్నాయి.