Begin typing your search above and press return to search.

సూపర్‌ మష్రూమ్స్‌ కిలో ధర రూ.30వేలు.. ఎక్కడ దొరుకుతాయంటే !

By:  Tupaki Desk   |   16 Oct 2020 12:30 AM GMT
సూపర్‌ మష్రూమ్స్‌ కిలో ధర రూ.30వేలు.. ఎక్కడ దొరుకుతాయంటే  !
X
ఆరోగ్యానికి ఎక్కువ పోషకాలు అందించే ఆహార పదార్థాల్లో పుట్టగొడుగులు కూడా ముందువరుసలో ఉంటాయి. శరీరానికి అవసరమయ్యే పొటాషియం, బి విటమిన్లు, ముఖ్యంగా డి విటమిన్ వీటిల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ప్రతిరోజూ తినకపోయినప్పటికీ, చాలా మంది అప్పుడప్పుడైనా తింటుంటారు. అయితే, పుట్టగొడుగుల కిలో ధర వందల్లో ఉంటుంది. కానీ, ఓ రకం పుట్టగొడుగుల ధర కిలో రూ.30వేలు పలుకుతోంది. అదేంటి పుట్టగొడుగులు ఏమైనా బంగారమా అని అనుకుంటున్నారా , అవునండి ఈ అరుదైన పుట్టగొడుగులు ఇంత ఖరీదైనా, దానికి తగ్గట్టే డిమాండ్‌ కూడా అంతే భారీగా ఉండటం విశేషం. అసలు ఈ పుట్టగొడుగులకు ఎందుకింత ధర, అంత ప్రత్యేకత ఏముంది అనే విషయాల గురించి చూస్తే..

శాస్త్రీయంగా మొర్కెల్లా ఎస్కులెంటా అని పిలిచే ఈ పుట్టగొడుగులను వాడుక భాషలో ‘గుచ్చి’ పుట్టగొడుగులు అని పిలుస్తుంటారు. సాధారణ పుట్టగొడుగుల్లో చాలా వరకు విషపూరితంగా ఉంటాయి. అందుకే ప్రత్యేకంగా పుట్టగొడుగులను పండించి మార్కెట్లో అమ్ముతుంటారు. కానీ ఈ గుచ్చి పుట్టగొడుగులు అటవీ ప్రాంతాల్లో సహజంగా పెరుగుతాయి. తేనె పట్టు ఆకృతిలో ఉండే ఈ పుట్టగొడుగులు హిమాలయాల పర్వత సానువులు, జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లోని పలు అటవీ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయి. శీతాకాలం ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాల్లోని స్థానికులు వీటిని సేకరించే పని మొదలుపెడతారు. అయితే ఇవి ఎక్కడ, ఎప్పుడు పెరుగుతాయో స్పష్టంగా తెలియదు. ఒక సీజన్‌లో ఒక చోట పెరిగిన పుట్టగొడుగులు.. మళ్లీ అదే చోట పెరగవు. ఇంత అరుదైన ఈ గుచ్చి పుట్టగొడుగులను సేకరించడం కోసం స్థానిక ప్రజలు చాలా కష్టపడాల్సి ఉంటుంది.

మొత్తం అటవీ ప్రాంతంలో ప్రతి అంగుళం అన్వేషించి వాటిని కనిపెట్టి సేకరించాలి. కొన్ని సార్లు ఎంత కష్టపడినా కనీసం కిలో పుట్టగొడుగులు కూడా లభించవు. అలా కష్టపడి సేకరించిన పుట్ట గొడుగులను విరగకుండా.. చాలా జాగ్రత్తగా వేడి నీళ్లలో కడిగి ఆరబెడతారు. అవి ఎండిన తర్వాత మార్కెట్లోకి పంపుతారు. సహజంగా పెరగడం, అధిక పోషకాలు, ప్రత్యేకమైన రుచి కలిగి ఉండటం, వీటిని సేకరించే ప్రక్రియలో కష్టం అన్ని కలిసి వీటి ధరను అంతలా పెంచాయి. అయితే, వీటి నాణ్యతను బట్టి కిలో ధర రూ.10వేల నుంచి 30వేల వరకు ఉంటుంది. పుట్టగొడుగులు విరగకుండా, తాజాగా ఉంటే మాత్రం రూ. 30వేలకు కిలో చొప్పున అమ్ముతుంటారు. ఈ పుట్ట గొడుగులను ముఖ్యంగా పలావ్‌ లా చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందని పాకశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టళ్లలో ఈ పుట్టగొడుగులు అందుబాటులో ఉన్నాయి. ఎండబెట్టిన ఈ పుట్టగొడుగుల్లో మంచి పోషకపదార్ధాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.