Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి.. అక్కడి ఉద్యోగాల‌కూ అదే డిమాండ్‌

By:  Tupaki Desk   |   30 July 2015 8:02 AM GMT
అమ‌రావ‌తి.. అక్కడి ఉద్యోగాల‌కూ అదే డిమాండ్‌
X
అమ‌రావ‌తి...న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని. ఈ ప్రాంతంలోని భూములు, అక్క‌డి అభివృద్ది స‌ర్వాత్ర చ‌ర్చ‌నీయాంశం అయిన సంగతి తెలిసిందే. సింగ‌పూర్ ప్ర‌భుత్వం స‌ల‌హాల‌తో ఆక‌ట్టుకునే నిర్మాణాల‌తో ముందుకు వెళుతున్న ఈ నూత‌న కేపిట‌ల్ కొత్త త‌రం డిజైన్ల‌తో ఆక‌ట్టుకుంటోంది. రాజ‌ధాని నిర్మాణం కోసం భూ సమీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హించేందుకు, ఆ త‌ర్వాత ప‌రిపాల‌న ప‌ర‌మైన సౌల‌భ్యం కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కేపిట‌ల్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌ మెంట్ అథారిటీ (ఏపీ సీఆర్‌ డీఏ)ను ఏర్పాటు చేసింది. ఇపుడు అమ‌రావ‌తి లాగే....సీఆర్‌ డీఏ కూడా హాట్ టాపిక్ అయింది.

సీఆర్‌ డీఏలో ఉద్యోగ నియామకాలకు ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల ద‌ర‌ఖాస్తులు ఆహ్వానింగా అభ్య‌ర్థులు భారీగా ధరఖాస్తు చేసుకున్నారు. 223 ఉద్యోగ నియామకాలకు 22,600 దరఖాస్తులు అందాయి. అధికారులు ద‌ర‌ఖాస్తుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించ‌గా...5,702 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. అర్హత సాధించిన వాళ్లంతా... ఆన్‌ లైన్‌ ద్వారా హాల్‌ టికెట్లు పొంద‌నున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 2, 3, 4, తేదీల్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో రాత పరీక్షలు జరగనున్నాయి.

ఇందు కోసం విజయవాడ కేంద్రంలో 3,281 మంది, విశాఖపట్నంలో 1,414, తిరుపతిలో 1,007 పరీక్షకు హాజరుకానున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది. మార్కుల ఆధారంగానే నియామకాలుంటాయని అధికారులు తెలిపారు. మధ్యవర్తులను నమ్మి మోసం పోవద్దని అధికారులు చెబుతున్నారు.