Begin typing your search above and press return to search.

ఈ ఒక్క సీటు..మహాకూటమిలోనే క్లిష్టమట..

By:  Tupaki Desk   |   11 Oct 2018 11:19 AM GMT
ఈ ఒక్క సీటు..మహాకూటమిలోనే క్లిష్టమట..
X
పార్టీలో అలకలు.. లుకలుకలు సహజం. అది మహా కూటమి ఐక్యానికి భంగం వాటిల్లితే ప్రమాదమే. ఓటింగ్ లో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పార్టీలన్నీ ఏకతా రాగం పాడినా చివరకు టిక్కెట్ కోసం ఫైట్ చేయాల్సిందే.. టికెట్ తమకే దక్కుతుందని ప్రచారం చేసుకున్నా కూటమిలో సర్దుబాటు కష్టంగా మారుతోంది.. నల్గొండ జిల్లాలో రేగుతున్న ఈ రాజకీయ దుమారం ఎటువైపు తీసుకుళ్తుందోనన్న భయాలు నేతల్లో వ్యక్తమవుతోంది.

నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నేత. నల్గొండ సిట్టింగ్ అభ్యర్థి. ఈ సారి కూడా టిక్కెట్ కేటాయించనుంది కాంగ్రెస్ అధిష్ఠానం. కానీ, వివాదంపై రేపుతుంది మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్సీ అయిన ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు మునుగోడును ఎంచుకున్నారు.

అయితే, మునుగోడు నుంచి పోటీ చేసేందుకు నియోజకవర్గ ఇన్ చార్జి పాల్వాయి స్రవంతి టిక్కెట్ అడుగుతున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా కొనసాగిన ఆమె తరువాత కాంగ్రెస్ లోకి చేరారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ పోతున్నారు. తనకే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ గెలిచే వారికే పార్టీ టిక్కెట్ కేటాయిస్తారని.. తనకే టికెట్ వస్తుందని బహిరంగంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

కాగా,మహాకూటమి సీట్ల సర్దుబాటులో మునుగోడును సీపీఐ అడుగుతోంది. ఆ పార్టీ నేతలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజగోపాల్ - స్రవంతి వ్యవహారాన్ని కూటమి పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. తమకు వదిలేసిన సీటుపై కాంగ్రెస్ నేతల ఆరాటం ఎందంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాజగోపాల్ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించేశారు.

దీంతో కాంగ్రెస్ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఎవరికి కాదన్న ఆందోళనకు దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ అలకలను ఎలా బుజ్జగించాలో కూటమి నేతలకు తెలియక సతమతమవుతున్నారు.