Begin typing your search above and press return to search.

ఆ సీటు యమ క్రేజు..తలసాని కాలం కలిసివచ్చేనా.?

By:  Tupaki Desk   |   26 Oct 2018 5:30 PM GMT
ఆ సీటు యమ క్రేజు..తలసాని కాలం కలిసివచ్చేనా.?
X
ఎన్నికల వేళ పార్టీల్లో టిక్కెట్ల ఆశావహుల సంఖ్య సనత్ నగర్ నియోజకవర్గానికి కొంచెం ఎక్కువగా ఉందట. అక్కడ టీఆర్ ఎస్ తరుపున తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండటమే ఇందుకు కారణం. మిగతా పార్టీలో అక్కడ బలమైన అభ్యర్థి ఎవరని ఇంకా తేల్చుకోకపోతుండగా - గట్టి పట్టు ఉన్న నేతలు నువ్వా నేనా అన్నట్లు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ ఎస్ లోకి జంప్ అయ్యారు. మంత్రి అయ్యారు. ఇప్పుడు కూడా ఆయన బరిలో ఉన్నారు. ఇక ఈయన ప్రత్యర్థి ఎవరనే అంశం ఇంకా బయటకు రాలేదు. కాంగ్రెస్ - టీడీపీ నేతలు కూటమిలో సీటు కోసం కల్లోలం సృష్టిస్తుండగా, బీజేపీ నేతల్లో ఇదే వ్యవహారం రక్తికట్టిస్తోంది.

కూటమిలో కాంగ్రెస్ - టీడీపీ భాగస్వాములు. ఇంకా సీట్ల ప్రకటన జరగలేదు. రేపో మాపో ఒక కొలిక్కి తీసుకువచ్చి ఎక్కడ ఎవరు పోటీ అనే విషయాన్ని తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సనత్ నగర్ నుంచి ఎవరు బరిలో దించాలనే విషయాన్ని ఇంకా ఒక నిర్ణయానికి రావడం లేదని సమాచారం. కాంగ్రెస్ తరుపున మాజీ సీఎం తనయుడు మర్రి శశిధర్ రెడ్డి టిక్కెట్టు అడుగుతుండగా - టీడీపీ నుంచి కూన వెంకటేష్ గౌడ్ టిక్కెట్టు ఆశిస్తున్నారు. ఇద్దరు సీటు కేటాయింపు కోసం పట్టు బడుతున్నారు.

చంద్రబాబు - లోకేష్ నుంచి హామీ తీసుకున్న వెంకటేష్ గౌడ్ ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. కాంగ్రెస్ నేతలు ఎవరూ ప్రచారం జోలికి వెళ్లడం లేదు. దీంతో ఈ నియోజకవర్గం విషయంలో కూటమిలో ఏం జరుగుతుందోననే విషయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీజేపీలో కూడా టిక్కుట్టు కేటాయింపు జరగలేదు. ఇక్కడ నుంచి పోటీకి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తనయుడు ప్రదీప్ కుమార్ సై అంటున్నారట. దీంతో ఇప్పటి వరకు టిక్కెట్టు ఆశిస్తున్న ఆశావహులు మండి పడుతున్నారట. అంతకంతకు టెన్షన్ పెరగుతున్న వేళ అసంతృప్తులతో ఏం జరుగుతుందోనన్న భయం అన్ని పార్టీలను సనత్ నగర్ విషయంలో వెంటాడుతోందట.