Begin typing your search above and press return to search.

తెలంగాణ బస్సుల్లో పోటెత్తుతున్న సీమాంధ్రులు

By:  Tupaki Desk   |   3 Nov 2015 6:04 AM GMT
తెలంగాణ బస్సుల్లో పోటెత్తుతున్న సీమాంధ్రులు
X
సీమాంధ్ర పరిధిలోని ఏ బస్టాండ్ లో అయినా సరే తెలంగాణ ప్రాంతానికి చెందిన డిపో బస్సు కనిపిస్తే చాలు.. ఆ బస్సుల్లోకి ఎక్కేందుకు సీమాంధ్రులు విపరీతమైన ఆసక్తి నెలకొంది. కర్నూలు.. విజయవాడ.. గుంటూరు.. ఇలా చాలా ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆర్టీసీ బస్సు కనిపిస్తే చాలు.. ఏపీ ఆర్టీసీ బస్సుల్ని వదిలేసి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో.. పలు బస్టాండ్లలో ఏపీ బస్సు కండక్టర్లు.. తెలంగాణ బస్సు కండక్టర్లతో వాదనకు దిగుతున్న పరిస్థితి. అయినా.. సీమాంధ్ర బస్సుల్ని వదిలేసి.. తెలంగాణ బస్సుల మీద సీమాంధ్రులు మక్కువ ప్రదర్శించటానికి కారణం లేకపోలేదు.

ఈ మధ్యన ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచటం తెలిసిందే. ఏపీ సర్కారు నిర్ణయానికి భిన్నంగా తెలంగాణ సర్కారు తమ ఆర్టీసీ బస్సు ఛార్జీలలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో.. ఏపీ.. తెలంగాణ బస్సుల మధ్య ఛార్జీల తేడా పది శాతం వరకూ ఉండటంతో.. ఏపీ బస్టాండ్ లకు వచ్చిన తెలంగాణ బస్సుల్లో ఎక్కేందుకు ఏపీ వాసులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

దీంతో.. అక్యుపెన్సీ రేటు తెలంగాణ బస్సుల్లో విపరీతంగా పెరిగిపోతే.. ఏపీ బస్సుల్లో పడిపోతోంది. ఇక.. ఆన్ లైన్లో బుకింగ్ లోనూ.. ఏపీ బస్సులకు డిమాండ్ ఉండని పరిస్థితి. ఏపీతో పోలిస్తే.. తెలంగాణకు చెందిన బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఏపీ ఆర్టీసీ అధికారులు గుర్రుగా ఉంటున్నారు. చూస్తూ.. చూస్తూ తమ వ్యాపారానికి నష్టం వాటిల్లుతుంటే ఎవరు మాత్రం బాధ పడకుండా ఉంటారు..? బస్సు ఛార్జీల్ని పెంచుతూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీకి.. తెలంగాణకు మధ్య దాదాపు పది శాతం వరకు వ్యత్యాసం ఉండటం గమనార్హం.