Begin typing your search above and press return to search.

5 జీ కోసం భారీ ఆరాటం.. ఎంతలా డిపాజిట్లు చేస్తున్నారంటే?

By:  Tupaki Desk   |   19 July 2022 2:30 PM GMT
5 జీ కోసం భారీ ఆరాటం.. ఎంతలా డిపాజిట్లు చేస్తున్నారంటే?
X
అప్పట్లో 2జీ.. ఆ తర్వాత 3జీ.. ఇప్పుడు నడుస్తోంది 4జీ. ఇకపై అందుబాటులోకి రానుంది 5జీ. ఈ తర్వాతి తరం సాంకేతికత కోసం.. ఇందుకు అవసరమైన స్పెక్ట్రం కోసం కంపెనీలు పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. కేంద్రం అమ్ముతున్న స్పెక్ట్రంను తమ సొంతం చేసుకోవటమే కాదు.. వీలైనంత త్వరగా దేశ ప్రజలకు 5జీ సాంకేతికతను.. దాని స్పీడ్ ను పరిచయం చేయాలని టెలికం కంపెనీలు ఆరాటపడుతున్నాయి.

5జీ స్పెక్ట్రం కోసం దేశంలోని అగ్ర టెలికం కంపెనీలతో పాటు.. కొత్తగా అదానీ గ్రూపు నుంచి గౌతమ్ అదానీ సైతం ఆసక్తి చూపుతున్న వైనం తెలిసిందే. ఇంతకాలం టెలికం రంగంలోకి ఎంట్రీ ఇవ్వని అదానీ.. 5జీ స్పెక్ట్రంతో అందులోకి అడుగు పెట్టాలని నిర్ణయించటం తెలిసిందే. ఇందులో భాగంగా అప్లికేషన్ పెట్టుకున్న అదానీ.. 5 జీ స్పెక్ట్రంను తనకూ కేటాయించాలని కోరుతోంది.

5జీ డిమాండ్ ఎంతలా ఉందనటానికి వీలుగా కంపెనీ ఆసక్తి చెప్పకనే చెప్పేస్తోంది. ఈ సాంకేతికత కోసం రిలయన్స్ జియో.. ఎయిర్ టెల్.. వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీలు పోటీ పడుతున్నారు. ఈ టెక్నాలజీని తమకు బదలాయించేందుకు అవసరమైన అనుమతుల కోసం తాము చెల్లించాల్సిన మొత్తంలోని అడ్వాన్సును టెలికం శాఖ వద్ద డిపాజిట్ చేసేందుకు కంపెనీలు తెగ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 5జీ సాంకేతికత కోసం అడ్వాన్సు రూపంలో టెలికం శాఖ వద్ద కంపెనీలు డిపాజిట్ చేసిన మొత్తం రూ.21,800 కోట్లుకు చేరుకుంది.

ఇందులో ముకేశ్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ జియో ఏకంగా రూ.14వేల కోట్లను డిపాజిట్ చేయటం గమనార్హం. గౌతమ్ అదానీ నాయకత్వంలోని అదానీ గ్రూప్ సైతం రూ.100 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేసింది. మిగిలిన మొత్తాన్ని ఇతర కంపెనీలు డిపాజిట్ చేశాయి. మొత్తంగా 5జీ పుణ్యమా అని.. కేంద్రానికి భారీ ఆదాయం సమకూరనుందని చెప్పక తప్పదు.