Begin typing your search above and press return to search.

టులెట్ బోర్డులు పెడితే భారీ జరిమానా.. జీహెచ్ఎంసీ క్లారిటీ

By:  Tupaki Desk   |   25 Aug 2021 1:30 PM GMT
టులెట్ బోర్డులు పెడితే భారీ జరిమానా.. జీహెచ్ఎంసీ క్లారిటీ
X
సోషల్ మీడియా వచ్చాక ఏది నమ్మవచ్చో ఏదీ నమ్మకూడదో తెలియని పరిస్థితి. పుకార్లు షికార్లు చేస్తున్న వేళ జనాలు అదే నిజం అనుకొని నమ్ముతూ హడలి చస్తున్నారు. కరోనా వైరస్ తొలి నాళ్లలోనూ ఇలాగే అసత్యాలు ప్రచారం చేసి జనాలను భయపెట్టారు. ఇప్పుడు మరోసారి అలాంటి దుష్ప్రచారమే జరుగుతోంది.

హైదరాబాద్ లో టులెట్ బోర్డులు పెడితే జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధిస్తున్నారనే వార్తలు జనంలో గందరగోళానికి దారితీశాయి. జీహెచ్ఎంసీ తీరుతో భవనాల, ఇంటి యజమానులు ఆందోళన చెందారు. టులెట్ బోర్డులు పెట్టడం నేరమా? అని ప్రశ్నిస్తున్నారు.

ప్రజలు తమ ఇళ్లలోని గదులు, దుకాణాలను అద్దెకు ఇవ్వడానికి తమ ఇంటిగోడలపై టులెట్ బోర్డులు పెట్టడం సర్వసాధారణం. అయితే ఇలా టులెట్ బోర్డు పెట్టినందుకు నగరంలో పలువురు వ్యక్తులకు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించడం చర్చకు దారితీసింది. ఇదెక్కడి రూల్ అని జనాలు గగ్గోలు పెడుతున్నారు. సొంతింటికి టులెట్ బోర్డు పెట్టినా ఫైన్ విధిస్తున్నారనే ప్రచారం మొదలైంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు. దీనిపై వారు క్లారిటీ ఇచ్చారు.

ఇంట్లో పెడితే ఎలాంటి సమస్య లేదని.. కానీ అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు, వాల్ రౌటింగ్ లకు మాత్రమే జరిమానా విధిస్తామని చెబుతున్నారు. సొంతింటికి టులెట్ బోర్డు పెట్టినా ఫైన్ అనేది వాస్తవం కాదంటున్నారు. వ్యక్తిగతంగా తమ తమ ఇళ్ల దగ్గర ఏర్పాటు చేసుకునే టులెట్ బోర్డులపై ఎలాంటి జరిమానాలు ఉండవంటున్నారు.

అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే అన్ని రకాల పోస్టర్లకే ఫైన్లు విధిస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో టులెట్, కోచింగ్, రియల్ ఎస్టేట్, పాన్ కార్డు చేస్తాం అని పోస్టర్లు పెడితే ఊరుకోమంటున్నారు. జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే ఈవీడీఎం కింద సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో నగరంలోని పలు చోట్ల బహిరంగ ప్రదేశాల్లోని అనధికార బ్యానర్లు ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు , వాల్ రైటింగ్ తదితరాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. జరిమానా విధించారు.

ఈ క్రమంలోనే సొంతింటికి టులెట్ బోర్డు పెట్టినా జరిమానా అంటూ వస్తున్న వార్తలను జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ ఖండించారు. ఇళ్లకు జరిమానా విధిస్తే తమ దృష్టికి తేవాలని ఆయన సూచించారు.బహిరంగ ప్రదేశాల్లో పెడితేనే జరిమానా అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారం టులెట్ బోర్డులు పెట్టే వారిపైనే కొరఢా ఝలిపిస్తామని.. ఇంటి వద్ద పెట్టుకుంటే జరిమానా విధించమని తెలిపారు.