Begin typing your search above and press return to search.

బాబు తప్పును సరిదిద్దుతోన్న ప్రకృతి

By:  Tupaki Desk   |   14 Aug 2019 7:47 AM GMT
బాబు తప్పును సరిదిద్దుతోన్న ప్రకృతి
X
కొన్ని తప్పుల్ని అస్సలు చేయకూడదు. అందునా నీతులు చెప్పే వారు అసలే చేయకూడదు. టీడీపీ అధినేత చంద్రబాబు బ్యాడ్ లక్ ఏమంటే.. ఆయన వరుస పెట్టి మరీ తప్పులు చేస్తుంటారు. తానున్న స్థాయికి తగ్గట్లుగా తన నిర్ణయాలు ఉండాల్సినప్పటికీ బాబు అదేమీ ఆలోచించకుండా చేసే పనులు ఆయన్ను తర్వాతి రోజుల్లో తెగ ఇబ్బందికి గురి చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు.

కృష్ణా కరకట్టలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవి. విలావంతంగా ఉండొచ్చు కానీ.. వాటి కారణంగా పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంటుందన్న కనీస విషయాన్ని బాబు మిస్ అయ్యారు. ఇప్పుడు అదే అంశం మాటలు పడేలా చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కరకట్టలకు సమీపంలో నిర్మించిన నిర్మాణాల్లో ఒకదాన్ని అద్దెకు తీసుకొని తన అధికారిక నివాసంగా సీఎం హోదాలో ఐదేళ్లు ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు ఎదురైన పరిస్థితి ఇంతకు ముందు ఎదురుకాలేదు.

బాబు పాలనలో వర్షాలు పెద్దగా పడకపోవటం.. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు పెద్ద ఎత్తున రాకపోవటంతో.. బాబు నివాసం జల దిగ్భందనానికి చోటు చేసుకోలేదు. కానీ.. ఈసారి అందుకు భిన్నంగా వరద నీరు పోటెత్తుతుండటంతో బాబు నివాసం చుట్టూ లారీల్లో పెద్ద ఎత్తున ఇసుక బస్తాల్ని తీసుకొచ్చి నిలుపుతున్నారు.

తాను వెళ్లాల్సిన ప్రాంతంలో అక్రమంగా కట్టే కట్టడాల్ని తనలో కలిపేసుకోవటం నీటికి అలవాటే. ఇప్పుడదే బాబుకు ఇబ్బందికరంగా మారింది. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాలపై కన్నెర్ర చేయటమే కాదు.. బాబు నివాసం ఉన్న ఇల్లు కూడా అక్రమ నిర్మాణమని.. కరకట్టలకు వచ్చే వరద తీవ్రతకు బాబు ఇల్లు మునిగే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు తాజాగా నిజమవుతున్నాయి.

అధికారం చేతిలో ఉండటంతో తమను వేధించేందుకు తానుండే అద్దెంటిని టార్గెట్ చేస్తున్నట్లుగా చెప్పిన బాబు మాటలు నిజం కావని తేలిపోవటంతో పాటు.. అక్రమ నిర్మాణాల కారణంగా ఎదురయ్యే దారుణ పరిస్థితులు ఎలా ఉంటాయో తాజాగా అమరావతిలోని బాబు నివాసం దగ్గరకు వచ్చి చేరుతున్న వరద నీటిని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. తానున్న అక్రమ నిర్మాణాన్ని కాపాడుకునేందుకు లారీలతో ఇసుక బస్తాల్ని తెప్పించి చుట్టూ పేరుస్తున్న వైనంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పు పట్టారు. తాము ముందే హెచ్చరించినట్లుగానే ఇప్పుడు జరిగిందని.. ఇప్పటికైనా బాబు తన ఇంటిని ఖాళీ చేస్తే మంచిదని ఆయన చెబుతున్నారు. నదీగర్భంలో అక్రమ నిర్మాణాలు ఎవరు కట్టినా ఇలాంటి ఇబ్బందులు తప్పవన్నారు. చూస్తుంటే.. బాబు చేసిన తప్పును ప్రకృతి సరి చేస్తున్నట్లుగా అనిపించట్లేదు?