Begin typing your search above and press return to search.

వైసీపీ మైనారిటీ నేతకు భారీ హామీ... ?

By:  Tupaki Desk   |   7 Feb 2022 2:30 AM GMT
వైసీపీ మైనారిటీ నేతకు భారీ హామీ... ?
X
విశాఖ జిల్లాకు చెందిన డాక్టర్ ఎస్ ఏ రహామాన్ సీనియర్ నేత. ఆయనది పాతికేళ్ల పైబడిన రాజకీయ అనుభవం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 1994లో మొదటిసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ తరువాత మాత్రం ఎన్నో సార్లు ప్రయత్నం చేసినా ఎమ్మెల్యే అన్నది అందరి పండు అయింది. ఈ మధ్యలో ఆయన ప్రజారాజ్యం పార్టీ వైపు వెళ్లి వచ్చారు. తిరిగి టీడీపీలో చేరినా కూడా అధికార హోదా మాత్రం దక్కలేదు. ఇక రెండేళ్ల క్రితం ఆయన వైసీపీలో చేరారు.

ఇక వైసీపీలో ఆయన ఎమ్మెల్సీ పదవిని ఆశించారు. మైనారిటీ కోటాలో తనకు అవకాశం దక్కుతుంది అనుకున్నారు. కానీ అధినాయకత్వం సమీకరణలు లెక్కల్లో ఆయన పేరు చివరాఖరులో ఎక్కడా లేకుండా పోయింది. దీంతో తీవ్ర నిరాశ చెందారనే అప్పట్లో వార్తలు వచ్చారు. వైసీపీలో చేరినందుకు ఫలితం ఏంటి అని ఆయన మధన చెందుతున్న వేళ అధినాయకత్వం తాజాగా రహమాన్ని పిలిచింది. ఆయన స్వయంగా వెళ్ళి ముఖ్యమంత్రి జగన్ని కలసి వచ్చారు.

ఆ మీదట ఆయన మంచి జోష్ లో ఉన్నారు. వచ్చిన వెంటనే మీడియా మీటింగ్ పెట్టి మరీ వైసీపీలోనే ఉంటానని చెప్పేశారు. తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలలో నిజం లేదని అన్నారు. 2024 ఎన్నికల్లో విశాఖ జిల్లాలో వైసీపీని గెలిపించి జగన్ కి కానుక ఇస్తామని కూడా చెబుతున్నారు.

మరి ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉన్న ఈ మైనారిటీ నేత సడెన్ గా సౌండ్ చేయడం వెనక రీజనేంటి అని ఆరా తీస్తే ఆయనకు వచ్చే ఎన్నికల్లో విశాఖ దక్షిణం నుంచి ఎమ్మెల్యే టికెట్ కి గట్టి హామీ లభించింది అంటున్నారు. విశాఖ దక్షిణంలో ఆయనకు బలం ఉంది. అంతే కాదు, గతంలో ఒకసారి గెలిచారు. ఇక మైనారిటీలు కూడా అక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు.

దాంతో అక్కడ ఆయనకు అవకాశం ఇవ్వాలని వైసీపీ హై కమాండ్ డిసైడ్ అయింది అంటున్నారు. ఇక విశాఖ దక్షిణం సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీకి చెందిన వారు, ఆయన వైసీపీ వైపు వచ్చినా అటూ ఇటూ అన్నట్లుగా ఊగిసలాడుతున్నారు అని చెబుతున్నారు. ఇక ఆయన్ని నమ్మలేమన్న ఉద్దేశ్యంతోనే వైసీపీ పెద్దలు రహమాన్ కి టికెట్ హామీ ఇచ్చారని చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ సీనియర్ మోస్ట్ నేత ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తారు. మరి ఆయన కనుక ఎమ్మెల్యేగా గెలిస్తే ముప్పయ్యేళ్ళ సుదీర్ఘమైన విరామం తరువాత శాసనసభలో అడుగు పెట్టిన రికార్డుని సొంతం చేసుకుంటారు.