Begin typing your search above and press return to search.

సినిమాటిక్‌ చోరీతో రూ.1800కోట్ల దోపిడీ

By:  Tupaki Desk   |   9 April 2015 4:10 AM GMT
సినిమాటిక్‌ చోరీతో రూ.1800కోట్ల దోపిడీ
X
అలవోకగా వందల కోట్ల రూపాయిల చోరీ చేసినట్లు చూపించే సినిమాలు చూసి.. ఇది సాధ్యమేనా? అంటూ ప్రశ్నించుకుంటాం. రీల్‌లైఫ్‌కి మించి రియల్‌లైఫ్‌లో భారీ చోరీ ఒకటి జరిగింది. అది కూడా అభివృద్ధి చెందిన బ్రిటన్‌ లాంటి దేశంలో. ఆ దేశంలోని లండన్‌ మహానరగంలో ఈస్టర్‌ సెలవుల్ని అసరాగా చేసుకొని ఒక బ్యాంక్‌లో జరిపిన దొంగతనం సంచలనం సృష్టిస్తోంది. ఈ చోరీతో రూ.1800కోట్లు దోపిడీ చేయటం గమనార్హం.

ఈస్టర్‌ సందర్భంగా ఇచ్చే సెలవుల్ని ఆసరా చేసుకొని దొంగలు తెలివిగా తెగబడ్డారంటున్నారు. బ్యాంకు పైకప్పును కట్‌ చేసి లోపలికి ప్రవేశించటమే కాదు.. అత్యాధునిక కటింగ్‌ యంత్రాలను తీసుకొచ్చి లాకర్లను కట్‌ చేశారు. అందులోని బంగారం.. విలువైన వజ్రాలు.. నగదును దోచుకెళ్లారు. సేఫ్‌ డిపాజిట్‌ బ్యాంకులో చోటు చేసుకున్న ఈ ఘటనతో బ్యాంకు ఖాతాదారులు లబోదిబోమంటున్నారు.

పోయిన సొత్తు విలువ రూ.1800కోట్లు అని సుమారుగా చెబుతున్నారు కానీ.. కచ్ఛితంగా మాత్రం చెప్పటం లేదు. దీనికి మరో కారణం లేకపోలేదు. పోయిన సొత్తు గురించి నిజం చెబితే ఆదాయపన్నుశాఖ నుంచి కొత్త కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉండటంతో పోయిన సొత్తు గురించి కిందామీదా పడుతున్న బాధితులు బయటకు మాత్రం నోరు విప్పని పరిస్థితి.

దొంగలు ఎంత తెలివిగా వ్యవహరించారంటే తాము దొంగలించిన సొత్తుతో పాటు సీసీ కెమేరాలను కూడా ఎత్తి కెళ్లిపోయారంట. జరిగిన ఘటనపై బ్యాంకు సిబ్బంది.. దొంగలు కుమ్మక్కై ఉంటారన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. లండన్‌లాంటి మహానగరంలోఇంత భారీ దోపిడీ అందరిని విస్మయపరుస్తోంది. ఈ చోరీతో బ్యాంకులోని భద్రతా లోపాలు భారీగానే బయటకు వస్తున్నాయంటున్నారు.