Begin typing your search above and press return to search.

అన్న‌గారి విగ్ర‌హానికి అంత ఖ‌ర్చెందుకు?

By:  Tupaki Desk   |   13 Dec 2018 10:12 AM GMT
అన్న‌గారి విగ్ర‌హానికి అంత ఖ‌ర్చెందుకు?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి లో నీరుకొండ‌ పై స్వ‌ర్గీయ ఎన్టీఆర్ నిలువెత్తు విగ్ర‌హాన్ని ఏర్పాటుచేయ‌నున్న‌ట్లు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. అన్న‌గారి విగ్ర‌హ ఏర్పాటు పై ఎవ‌రికీ అభ్యంత‌రాలు లేన‌ప్ప‌టికీ.. అందుకు చేయ‌నున్న ఖ‌ర్చు పై ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మ‌రీ ఇంత ఖ‌ర్చు పెట్ట‌డం అవ‌స‌ర‌మా అంటూ పెద‌వి విరుస్తున్నారు. రాష్ట్రాన్ని, రాజ‌ధాని ని టూరిజం అట్రాక్ష‌న్స్ గా మార్చేందుకు ఇత‌ర మార్గాలే లేవా అంటూ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

వాస్త‌వానికి నీరుకొండ‌ పై 70-80 ఎక‌రాల విస్తీర్ణంలో ఎన్టీఆర్ మెమోరియ‌ల్ ప్రాజెక్టు చేప‌ట్టాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం తొలుత భావించింది. ఏమైందో తెలియ‌దుగానీ బుధ‌వారం ఈ ప్రాజెక్టు విస్తీర్ణాన్ని ఒక్క‌సారిగా 200 ఎక‌రాల‌కు పెంచింది. 32 మీట‌ర్ల ఎత్తైన అన్న‌గారి విగ్ర‌హాన్ని ఏర్పాటుచేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇందుకు మొత్తం రూ.406 కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని అంచ‌నా వేసింది. ఎన్టీఆర్ మెమోరియ‌ల్ ప్రాజెక్టు లో స్టార్ హోట‌ళ్లు- ఆడిటోరియం- వాట‌ర్ ఫ్రంట్‌- సెల్ఫీ పాయింట్ వంటి అనేక హంగులు క‌ల్పించ‌నున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించింది.

అయితే - రాష్ట్రాన్ని ప‌ర్యాట‌క ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే ఇత‌ర మార్గాలేవీ లేవా అంటూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పై ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఒక్క‌రి స్మార‌క నిర్మాణం కోసం ఇంత‌టి భారీ ఖ‌ర్చు అవ‌స‌ర‌మా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఒక‌ వైపు రాష్ట్రంలో అన్న‌దాత‌లు అప్పుల ఊబి లో కూరుకుపోతుంటే ఒక్క విగ్ర‌హ‌ ఏర్పాటుకు రూ.వంద‌ల కోట్లు వెచ్చించ‌డ‌మేంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.
ఉక్కు మ‌నిషి స‌ర్దార్ వ‌ల్ల‌బ్ భాయ్ ప‌టేల్ కు నివాళి గా ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం గుజ‌రాత్ లోని న‌ర్మ‌దా న‌ది తీరంలో భారీ విగ్ర‌హాన్ని నిర్మంచింది.

ఇటీవ‌లే దాన్ని ఆవిష్క‌రించింది. ఆ విగ్ర‌హ ఏర్పాటుకైన ఖ‌ర్చు దాదాపు రూ.3 వేల కోట్లు. దీంతో దేశ‌వ్యాప్తంగా మోదీ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. అప్పులు క‌ట్ట‌లేక రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుంటే వేల కోట్లు వెచ్చించి విగ్ర‌హాలు నిర్మించ‌డ‌మేంట‌ని చాలామంది విమ‌ర్శించారు. స‌ర్దార్ విగ్ర‌హ ఏర్పాటు తో న‌దీతీరానికి ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగానూ తీవ్రంగా న‌ష్టం జ‌రిగింద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. అందుక విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని న‌ర్మ‌దా తీరంలోని గ్రామాల‌న్నీ బ‌హిష్క‌రించాయి.

స‌ర్దార్ విగ్రహ ఏర్పాటు తో వెల్లువెత్తిన విమ‌ర్శ‌లు చూసి కూడా చంద్ర‌బాబు ఎన్టీఆర్ విగ్ర‌హ ఏర్పాటు ఖ‌ర్చును భారీగా పెంచ‌డాన్ని ప‌లువురు త‌ప్పుప‌డుతున్నారు. యావ‌త్ భార‌త‌దేశాన్ని నియంత్రించే కేంద్ర‌ప్ర‌భుత్వం రూ.3 వేల కోట్లు పెడితేనే అంత‌గా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మ‌రి చంద్ర‌బాబు రూ.400 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టి విగ్ర‌హం నిర్మిస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో, జ‌నం ఎంత‌గా ఆగ్ర‌హిస్తారో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే!