Begin typing your search above and press return to search.

బిచ్చగాడి ఇంట కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు...విజిలెన్స్ అధికారులకు షాక్

By:  Tupaki Desk   |   18 May 2021 3:08 AM GMT
బిచ్చగాడి ఇంట కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు...విజిలెన్స్ అధికారులకు షాక్
X
ఓ యాచకుడు ఇంటిని జప్తు చేసేందుకు వెళ్లిన అధికారులకు అక్కడ ఎదురైన ఊహించని సంఘటన ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇంట్లో రెండు ట్రంకు పెట్టెలు కనిపించగా.. వాటిని తెరిచి చూడగా వాటినిండా నోట్ల కట్టలు కనిపించాయి. బిచ్చగాడి ఇంట కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు కనిపించడంతో విజిలెన్స్ అధికారులు విస్తు పోయారు. తిరుమలలో నివాసం ఉండే శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడే యాచించుకుంటూ జీవనం సాగించేవాడు. తిరుమలకు వచ్చే వీఐపీల వద్ద బిక్షమెత్తుకునేవాడు. ఇలా 20 ఏళ్ల నుంచి శ్రీనివాసన్ తిరుమలలో యాచించుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నాడు.

అయితే తిరుమలలో మాస్టర్ ప్లాన్ అమలు లో భాగంగా కొన్నేళ్ళ కిందట టీటీడీ అధికారులు అక్కడ స్థానికంగా నివాసం ఉండే వారిని ఖాళీ చేయించారు. అందుకు బదులుగా వారికి తిరుపతిలోని శేషాచలనగర్ లో ఇళ్లను కేటాయించారు. కాగా గత ఏడాది అనారోగ్యానికి గురైన శ్రీనివాసన్ మృతిచెందాడు. తిరుపతిలో అతడు నివాసం ఉంటున్న ఇల్లు ఏడాదిగా ఖాళీగా ఉండడంతో దాన్ని స్వాధీనం చేసుకునేందుకు సోమవారం టీటీడీ అధికారులు అక్కడికి వెళ్లారు. తలుపు తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లగా ఇంట్లో రెండు ట్రంకు పెట్టెలు కనిపించాయి. వాటిని తెరవగా నిండా నోట్ల కట్టలు కనిపించాయి. దీనితో అధికారులు షాక్ కు గురయ్యారు.

వెంటనే వారు విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చి డబ్బులు లెక్క పెట్టేందుకు మెషిన్ తెప్పించి ఐదుగురు సిబ్బందితో గంటన్నరపాటు సొమ్ము లెక్కించారు. యాచకుడు ఇంట్లో సుమారు రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ట్రంకు పెట్టెలో పెద్ద సంఖ్యలో పది, ఇరవై నోట్లతో పాటు రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు, కొత్త 2000 నోట్లు కూడా కనిపించాయి. బిచ్చగాడి ఇంట నోట్ల కట్టలు కుప్పలు కుప్పలుగా బయటపడటంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. శ్రీనివాసన్ ఒంటరిగా జీవిస్తున్నాడు. అతడికి కుటుంబం, బంధువులు ఎవరూ లేకపోవడంతో అతడి ఇంట్లో స్వాధీనం చేసుకున్న డబ్బును టీటీడీకి అప్పగించారు.