Begin typing your search above and press return to search.

మతగురువు అంతిమయాత్రకు వందలాది మందా? రూల్స్ ఏమీ ఉండవా?

By:  Tupaki Desk   |   28 Jun 2020 6:30 AM GMT
మతగురువు అంతిమయాత్రకు వందలాది మందా? రూల్స్ ఏమీ ఉండవా?
X
తప్పు చేస్తే ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానులే లాంటి మాటల్ని తరచూ వింటుంటాం. మరి.. తాజాగా వైరల్ అవుతున్న కొన్ని ఫోటోల్ని చూస్తే.. ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా కూడా చేస్తారా? అన్న సందేహం కలుగుక మానదు. ఓపక్క మహమ్మారి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వేళలో.. ఒక మతగురువు అంతిమయాత్రకు వందలాదిగా పాల్గొన్న వైనం విస్తుపోయేలా చేస్తోంది.

మహాదత్ - ఏ- ఇస్లామీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమ్ మత గురువు మౌలానా నసీరుద్దీన్ అనే పెద్దాయన శనివారం మరణించారు. 75 ఏళ్ల ఆయన అంటే.. కొందరికి వల్లమాలిన ప్రేమాభిమానాలు. ఆయన తీరును మెచ్చుకునే వారు ఉన్నట్లే.. తప్పుపట్టే వారు లేకపోలేదు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఈ పెద్దాయనకు మంచి సంబంధాలు లేవని చెబుతారు. ఇదిలా ఉంటే.. పది రోజుల క్రితం ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో.. ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చేసిన పరీక్షలో కరోనా పాజిటివ్ అని రాగా.. మరో పరీక్ష చేయిస్తే నెగిటివ్ వచ్చింది. ఈ సందేహం ఇలా ఉంటే.. ఇంటి దగ్గరే ఉంటున్న ఆయన శనివారం మరణించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు మరణించినా సరే.. పరిమిత కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియల్ని నిర్వహించాలి. అందుకు భిన్నంగా మతగురువు అంత్యక్రియల కోసం వందలాది మంది హాజరైన వైనం సంచలనంగా మారింది. ఒకవైపు పాజిటివ్ తో మరణించారా? లేదా? అన్నది తేలలేదు. ఈ కన్ఫ్యూజన్ ఉండగానే.. ఆయన అంత్యక్రియలకు వందలాది మంది హాజరు కావటం.. ముఖానికి మాస్కులు లేకుండా ఉండటం.. భౌతిక దూరాన్ని పాటించకపోవటం లాంటివి చేశారు.

అంతిమయాత్రకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. పోలీసుల మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తే ఇంత భారీగా జనాలు ఒకచోటుకు చేరే అవకాశం ఉండేది కాదన్న వాదన వినిపిస్తోంది. ప్రజల్లో పలుకుబడి ఉన్న ఒక మతగురువు మరణించినప్పుడు.. ఇలాంటివి చోటు చేసుకోకకుండా ఉండేందుక పక్కా ప్లాన్ తో ప్రజలు ఒకదగ్గరకు పెద్దసంఖ్యలో చేరుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ.. ఈ విషయంలో స్థానిక పోలీసు యంత్రాంగం చేతులెత్తేసినట్లుగా విమర్శలున్నాయి. ఇంత భారీగా ప్రజలు హాజరైన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. నిబంధనలు అందరికి ఒకేలా ఉంటే.. ఇలాంటివి ఎందుకు చోటు చేసుకుంటున్నట్లు? అన్నసామాన్యుడి సందేహాన్ని తీర్చేవారెవరు?