Begin typing your search above and press return to search.

పవన్ మౌనం వెనుక భారీ ప్లానింగ్

By:  Tupaki Desk   |   14 Aug 2021 11:30 AM GMT
పవన్ మౌనం వెనుక భారీ ప్లానింగ్
X
మిగిలిన రాజకీయనేతలకు భిన్నమైన నేతగా పవన్ కల్యాణ్ ను చెప్పాలి. తాను ఓడిపోతున్నానని తెలిసి కూడా నమ్మిన విలువ కోసం.. ఓట్లకు డబ్బులు ఇవ్వకుండా ఓడిపోవటంఅతనికి మాత్రమే సాధ్యమేమో. సాయం చేయండంటూ చేయి జాపిన వారికి అప్పులు చేసి మరీ సాయం చేసేందుకు వెనుకాడని పవన్.. నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఉండేందుకు అవమానకరమైన ఓటమికి సిద్ధమయ్యారన్న మాట పవన్ సన్నిహితులు చెబుతారు. 2019 ఎన్నికల్లో రెండుచోట్ల గెలిచేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. ఒక్క మందు బాటిల్ కానీ.. ఒక బిర్యానీ పాకెట్ కానీ.. ఓటుకు నోటు ఇచ్చేందుకు ససేమిరా అనటమే ఆయన్ను ఓడిపోయేలా చేసిందని చెప్పాలి.

దారుణమైన ఓటమి ఎదురయ్యాక.. రాజకీయాల వైపు చూడటానికి సాహసించరన్న మాట కొందరి నోట వినిపించింది. మరికొందరైతే.. పార్టీని కమలదళంలో కలిపేస్తారని.. భారీ ప్యాకేజీకి చర్చలు జరుగుతున్నట్లుగా మాట్లాడినోళ్లు ఉన్నారు. కానీ.. అదంత నిజం కాదన్న విషయాన్ని తన చేతలతో చెప్పేశారు. ఏపీకి సంబంధించిన నేతల్లో ఏమైనా మేధావితనం ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ముందువరుసలో కనిపిస్తారు.

అలాంటి ఉండవల్లి నోటి నుంచి జనసేనాని గురించి పాజిటివ్ వ్యాఖ్యలు చేయటం మర్చిపోకూడదు.ఎన్నికల్లో ఓటమి తర్వాత బయటకు రాలేడని అనుకున్నానని.. తన అంచనాలకు భిన్నంగా వ్యవహరించాడని.. ఖర్చులకు అవసరమైన డబ్బుల కోసం తాను సినిమాలు చేస్తానని ఓపెన్ గా చెప్పిన తీరును అభినందించారు. ఇంత నిజాయితీగా విషయాల్ని చెప్పే నేతలు కనిపించరన్న అభిప్రాయాన్ని ఉండవల్లి వ్యక్తం చేశారు.

గడిచిన కొద్దికాలంగా మౌనంగా ఉంటున్న పవన్ కల్యాణ్.. అసలేం జరిగినా తనకు పట్టనట్లుగా ఉండటం వెనుక కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి కారణం లేదంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత ఒకప్పుడు తాను ఎటకారం చేసిన బీజేపీతో మరోసారి జత కట్టిన సంగతి తెలిసిందే. అయితే.. మొదటి సారి మాదిరే ఇప్పుడు కూడా ఏపీ ప్రయోజనాల గురించి మోడీ అండ్ కో పట్టించుకోవటం లేదన్న ఆవేదనతో పవన్ ఉన్నారు.

అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదన్న ఆలోచనలో ఉన్న పవన్ కల్యాణ్.. ఇష్యూల మీద స్పందించటం మానేశారు. అందుకు విరుద్ధంగా ప్రతి విషయానికి చంద్రబాబును మాట్లాడుతుంటే.. ఆయన కాసేపు మౌనంగా ఉంటే మంచిదని కోరుకునే టీడీపీ నేతలు చాలామందే ఉంటారు. సరిగ్గా వారు బాబు నుంచి ఏం కోరుకుంటున్నారో.. తన నుంచి కూడా అదే కోరుకుంటారన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే పనిగా మాట్లాడటం.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిసిన తర్వాత.. ఉత్తినే మాట్లాడి ఎలాంటి లాభం ఉండదని పవన్ కు తెలుసు.

అందుకే ఆయేనేం జరుగుతున్నా.. ఎవరెంత రెచ్చగొడుతున్నా.. మరెన్ని సవాళ్లు విసిరినప్పటికి స్పందించకుండా కామ్ గా ఉంటున్నారు. ఇదంతా వ్యూహాత్మక మౌనమే తప్పించి మరొకటి కాదంటున్నారు. 2024 ఎన్నికలకు సిద్ధం కావాలే తప్పించి.. అదే పనిగా ఎంత మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఈ విషయం తెలిసినందు వల్లే తెలుసు పవన్ తన రూట్ మార్చుకున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల వరకు ప్రెస్ నోట్లతో తన వాదనను మీడియాతో వినిపించటం మినహా మరింకేమీ మాట్లాడకపోవటం తెలిసిందే. తాను అనుకున్నట్లుగా పొత్తుల్ని సిద్ధం చేసుకొని.. కొత్త ఎత్తులతో జగన్ ను ఢీ కొనాలన్న ఉద్దేశంతోనే పీకే మౌనంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ వాదనలో నిజమేమిటన్నది కాలమే సరైన సమాధానం చెప్పగలగాలి.