Begin typing your search above and press return to search.

లాక్ డౌన్: వైన్ షాపుల ఎదుట జాతర

By:  Tupaki Desk   |   19 April 2021 1:30 PM GMT
లాక్ డౌన్: వైన్ షాపుల ఎదుట జాతర
X
ఢిల్లీలో కరోనా కేసుల దృష్ట్యా కేజ్రీవాల్ ప్రభుత్వం సోమవారం రాత్రి నుంచి ఏప్రిల్ 26 వరకు పూర్తి లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా కల్లోలంలో వైరస్ వ్యాపిస్తుందని ఏమాత్రం భయం లేని మందుబాబులు ఎంచక్కా వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. భారీగా బారులు తీరారు.

ఢిల్లీలో లాక్ డౌన్ ప్రకటనతో మందుబాబులు వైన్ షాపుల ముందు క్యూలు కట్టడంతో అక్కడంతా జాతరను తలపిస్తోంది. విశేషం ఏంటంటే మహిళలు కూడా షాపుల ముందు బారులు తీరారు. ఈ నేపథ్యంలో వైన్స్ షాపుకు వచ్చిన ఓ మహిళ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కరోనా వస్తే ఇంజక్షన్ వేసుకునే బదులు అల్కహాల్ ను వాడితే నయం అవుతుందని చెప్పడం కొసమెరుపు. తనకు మందులు వాడితే తగ్గదని.. ఒకరోజు ఒక పెగ్ మద్యం తాగితే సెట్ అవుతుందని అనడం చూసి అక్కడున్న మందుబాబులు సైతం ముక్కున వేలేసుకున్నారు.

డాక్టర్ రాసే మందు తనకు అసలే పనిచేయదని.. అల్కహాలే సర్వరోగ నివారిణి అని తెలిపింది. ఆవిడ చెప్పిన సమాధానం విన్న జర్నలిస్ట్ అవాక్కయ్యాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు వారీ కేసుల సంఖ్య దాదాపు 3 లక్షలుగా ఉంటోంది. ఢిల్లీలో పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దీంతో సీఎం కేజ్రీవాల్ అక్కడ లాక్ డౌన్ విధించారు. ఒకే రోజు 25వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో ఏప్రిల్ 26వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంటుందని తెలిపారు.