Begin typing your search above and press return to search.

కొవిడ్ అప్డేట్: ఆడ్మిట్లు తగ్గాయి..డిశ్చార్జులు పెరిగాయట

By:  Tupaki Desk   |   21 Feb 2020 6:45 AM GMT
కొవిడ్ అప్డేట్: ఆడ్మిట్లు తగ్గాయి..డిశ్చార్జులు పెరిగాయట
X
డ్రాగన్ దేశాన్ని వణికిస్తున్న కొవిడ్ 19 (కరోనా) వైరస్ కు సంబంధించి ఇన్నాళ్లకు ఉపశమనం కలిగించే అప్డేట్ వెలువడింది. గడిచిన కొన్నివారాలుగా కొవిడ్ వైరస్ ను కంట్రోల్ చేయటం ఎలా అంటూ కిందా మీదా పడుతున్న చైనాకు తాజా పరిస్థితులు కొంత రిలీఫ్ ఇచ్చేలా ఉన్నాయని చెబుతున్నారు.

క్యాలెండర్లో రోజు మారితే చాలు.. మరణాల సంఖ్య అధికంగా ఉండటం.. వైరస్ బాధితుల సంఖ్య భారీగా ఉండటంతో.. ఏం చేయాలో తోచని పరిస్థితి. పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. చైనాలో కొవిడ్ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న హుబేలో పరిస్థితి ఇప్పుడు మెరుగుపడినట్లుగా చెబుతున్నారు.

కొత్తగా వెలుగు చూస్తున్న కేసులు తగ్గి.. పాత కేసులు ఒక కొలిక్కి వచ్చి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఈ మహ్మమారి కారణంగా 2118 మంది మరణించగా.. వైరస్ బారిన పడినోళ్ల సంఖ్య దగ్గర దగ్గర 75 వేల వరకూ ఉన్నాయి. తాజాగా మాత్రం కొవిడ్ వైరస్ కేసులు కొత్తవి తగ్గుముఖం పడితే.. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న వారు కోలుకొని ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నారు.

ఇదే పరిస్థితి కొనసాగితే మార్పు మొదలైనట్లేనని చెబుతున్నారు. తాజా పరిణామాలు చైనాకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. దక్షిణకొరియాలో కవిడ్ వైరస్ సోకిన వారిలో తొలి మరణం చోటు చేసుకుంది. దీంతో.. అలెర్ట్ అయిన ఆ దేశం.. మతప్రార్థనలకు ఒకే చోటకు ప్రజలు చేరకూడదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఒక పట్టాన కొరుకుడుపడని కొవిడ్ ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తోందన్న మాట వినిపిస్తోంది. భయంలో వణుకుతున్న వారికి ఇదో శుభవార్తగా మారుతుందని చెప్పకతప్పుదు.