Begin typing your search above and press return to search.

వెలగపూడి ‘అద్దె’రిపోతోంది

By:  Tupaki Desk   |   5 Oct 2016 12:09 PM GMT
వెలగపూడి ‘అద్దె’రిపోతోంది
X
నవ్యాంధ్రలో వెలగపూడి తాత్కాలిక సచివాలయానికి హైదరాబాద్‌ నుంచి ఏపీ పాలనా యంత్రాంగం మొత్తం తరలిన నేపథ్యంలో అక్కడ అద్దెలు మోతెక్కుతున్నాయి. వెలగపూడిలో రెండు పడక గదుల ఇంటి అద్దె రూ.10 వేలకు తక్కువ చెప్పడం లేదు. ఒక్క పైసా కూడా తగ్గించే ప్రసక్తి లేదని ఖరాకండీగా ఆయా గృహాల యజమానులు పేర్కొంటున్నారు. బ్యాచిలర్లకైతే ఇల్లు ఇవ్వబోమని, కుటుంబానికే ఇస్తామని చెబుతున్నారు. సచివాలయం ఉద్యోగుల కుటుంబాలు చాలా వరకు ప్రస్తుతానికి హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరం మధ్యలో ఉండటం వల్ల ఉద్యోగులు కుటుంబాలతో ఇక్కడికి తరలి రావడం లేదు. ఇక్కడైతే బ్యాచిలర్‌ గా ఉండేవారికి ఇల్లు దొరకడం కష్టతరమమవుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం - మహిళా ఉద్యోగుల వరకు రెయిన్‌ ట్రీ భవన సముదాయంలో తాత్కాలికంగా వసతి కల్పించింది. పురుష ఉద్యోగులు అద్దె ఇళ్లు చూసుకోవాలని, హెచ్‌ ఆర్‌ ఎ చెల్లిస్తామని చెబుతున్నారు.

మరోవైపు ఒక్క వెలగపూడిలోనే కాకుండా ఆ సమీపంలోని మందడం - కృష్ణాయపాలెం - వెంకటాయపాలెం - ఉండవల్లి - పెనుమాక ప్రాంతాల్లో కూడా అద్దెలు పెరగడమేకాక - బ్యాచిలర్లకు ఇళ్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. విజయవాడ నగరంలో ఇప్పటికే అద్దెలు భారీగా పెరిగిపోయాయి. ఇక్కడ అద్దెలు చెల్లించలేక మధ్య తరగతి కుటుంబాలవారు అనేక మంది సమీప గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులూ రాజధానికి సమీప గ్రామాలనే నివాసానికి ఎంచుకుంటున్నారు. దీంతో సచివాలయం సమీప గ్రామాల్లో అద్దెలు భారీగా పెరిగిపోయాయి.

కాగా హైదరాబాద్‌ సచివాలయం నుంచి వెలగపూడి సచివాలయానికి తరలి వచ్చే వాళ్లకు ఇళ్లు చూపిస్తామని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గతంలో ప్రకటించారని - ఇప్పుడు వారి జాడే లేదని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. కనీసం అద్దె ఎక్కువైనా సచివాలయం సమీప గ్రామంలోనే ఉంటామని, బ్యాచిలర్లకు అద్దె ఇళ్లు ఇవ్వకపోతే తామెక్కడ ఉండాలని కొందరు అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు మాదిరిగా తమకూ వసతిని ప్రభుత్వమే ఇస్తే బాగుండేదని వారంటున్నారు.

వెలగపూడిలో సచివాలయం ఏర్పడడం.. చుట్టూ ఇతరత్రా భవనాలు - దుఖానాలు నెలకొంటుండడంతో అక్కడ పట్టణ వాతావరణం ఏర్పడుతోంది. అయితే... హైదరాబాద్ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులు పిల్లల చదువుల కారణంగా కుటుంబాలను అక్కడే ఉంచేయడంతో ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నారు. దీంతో వెలగపూడిలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఫోర్సుడ్ బ్యాచిలర్సే కనిపిస్తున్నారట. వెలగపూడిని అందరూ ఫోర్సుడ్ బ్యాచిలర్స్ టౌన్ అని సరదాగా అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/