Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ప్ర‌జా ద‌ర్బార్‌!.. ఆ లెక్కే వేరబ్బా!

By:  Tupaki Desk   |   15 May 2019 3:55 PM GMT
జ‌గ‌న్ ప్ర‌జా ద‌ర్బార్‌!.. ఆ లెక్కే వేరబ్బా!
X
ఏపీ విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ఏది చేసినా ప్ర‌త్యేక‌మేన‌ని చెప్పాలి. ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థానాన్ని సంపాదించుకున్న దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమారుడిగా జ‌గ‌న్ కు ఆది నుంచి జ‌నాల్లో మంచి ఫాలోయింగ్ ఉంద‌నే చెప్పాలి. త‌న తండ్రి మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక మ‌ర‌ణించిన వందలాది కుటుంబాల‌కు అండ‌గా నిల‌వాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు సాగిన జగ‌న్ ను కాంగ్రెస్ పార్టీ ఏకాకిని మార్చే య‌త్నం చేసినా వెనక్కు త‌గ్గ‌ని జ‌గ‌న్‌... ఏకంగా కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా పార్టీ పెట్టి గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ కే బిగ్ షాకిచ్చారు.

ఆ త‌ర్వాత కాంగ్రెస్ నుంచే కాకుండా టీడీపీ నుంచి కూడా త‌న పార్టీలోకి చేరిన నేత‌ల‌ను సాద‌రంగానే ఆహ్వానించిన జ‌గ‌న్‌... ఆ రెండు పార్టీల టికెట్ల మీద ద‌క్కిన ప‌ద‌వుల‌ను వ‌దిలేసి రావాల‌ని కూడా సూచించారు. ఈ త‌ర‌హా నిర్ణ‌యం తీసుకోవ‌డం ప్రస్తుత రాజ‌కీయాల్లో చాలా ధైర్యంతో కూడిన నిర్ణ‌యంగా చెప్పాలి. ఓ కొత్త‌గా పార్టీని పెట్టి... దానిలోకి వ‌చ్చే నేత‌ల‌ను ప‌ద‌వులు వ‌దిలేస్తేనే స్వాగ‌తిస్తాన‌ని చెప్పడమంటే మాలు కాదు క‌దా. స‌రే.. ఇలా చెప్పుకుంటూ పోతే... జ‌గ‌న్ కు సంబంధించి చాలా విష‌యాలే చెప్పాల్సి వ‌స్తుంది. ఏపీలో పోలింగ్ ముగిసి ఫ‌లితాల కోసం ఎదురు చూస్తున్న వేళ‌... ఎడ‌తెరిపి లేని ప‌ర్య‌ట‌న‌లు, ప్ర‌చారం నుంచి కాస్తంత రెస్ట్ తీసుకున్న జ‌గ‌న్‌... నిన్న సొంతూరు పులివెందుల‌కు వెళ్లారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న అక్క‌డే ఓ రెండు రోజుల పాటు ఉండ‌నున్నారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లిన జ‌గ‌న్‌... అక్క‌డ త‌న బంధుమిత్రుల‌తో కాల‌యాప‌న చేయ‌డానికి అంత‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేదు.

బుధ‌వారం తెల్లారిన వెంట‌నే నియోజక‌వ‌ర్గ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లపై దృష్టి సారించేందుకు ఏకంగా ప్ర‌జా ద‌ర్బార్‌ ను నిర్వ‌హించారు. ఈ ప్ర‌జా ద‌ర్బార్‌ కు వ‌చ్చిన జ‌నంతో జ‌గ‌న్ ఇల్లు జ‌న‌సంద్రాన్నే త‌ల‌పించింది. పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చిన జ‌నం.. జ‌గ‌న్ కు త‌మ సమ‌స్య‌ల‌ను విన్న‌వించారు. ఇత‌ర రాజ‌కీయ నేత‌ల ద‌గ్గ‌ర‌కెళ్లే ప్ర‌జ‌లు... పిల్లాపాప‌ల‌ను తీసుకెళ్ల‌డం మ‌నం చూసి ఉండం. అయితే జ‌గ‌న్ వ‌ద్ద‌కు స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు వ‌చ్చిన జ‌నం.. త‌మ పిల్లాపాప‌ల‌తో ప్ర‌జాద‌ర్బార్‌ కు రావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జాద‌ర్బార్ లో క‌నిపించిన పిల్ల‌ల‌ను జ‌గ‌న్ ఆప్యాయంగా ప‌ల‌క‌రించ‌డంతో పాటు వారిని ఏమాత్రం దూరం పెట్ట‌కుండానే ద‌ర్బార్ ను నిర్వ‌హించారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయాయి.