Begin typing your search above and press return to search.

గుంటూరు త‌ల‌ద‌న్నేలా కృష్ణాలో పాద‌యాత్ర‌

By:  Tupaki Desk   |   1 May 2018 6:16 AM GMT
గుంటూరు త‌ల‌ద‌న్నేలా కృష్ణాలో పాద‌యాత్ర‌
X
ఎవ‌రెన్ని చెప్పినా.. కృష్ణా జిల్లాలో టీడీపీకి ప‌ట్టు ఎక్కువే. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ సొంత జిల్లా కావ‌టంతో ఎమోష‌న‌ల్ గా ఆ పార్టీకి ప్ర‌జ‌ల్లో ఉండే అటాచ్ మెంట్ ఎక్కువే. దీనికి త‌గ్గ‌ట్లే ఎన్నిక‌ల ఫ‌లితాలు న‌మోద‌వుతూ ఉంటాయి. అలాంటి కృష్ణా జిల్లాలో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న పాద‌యాత్ర ఇప్పుడు కొత్త అంచ‌నాల‌కు తెర తీసేలా ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

2014 ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున సీట్లు సాధించిన టీడీపీకి.. 2019 ఎన్నిక‌ల్లో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేందుకు ప్ర‌జ‌లు సిద్దంగా ఉన్నార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వ‌స్తున్న స్పంద‌న‌.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆయ‌న్ను చూసేందుకు.. ఆయ‌న మాట‌ల్ని ఆస‌క్తిగా వినేందుకు చూపిస్తున్న ఆస‌క్తి ఏపీ అధికార ప‌క్షంలో కొత్త చ‌ర్చ‌కు తెర తీసిన‌ట్లుగా తెలుస్తోంది. క‌డ‌ప జిల్లాలో మొద‌లైన జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సంబంధించి.. ఆయ‌న‌కు పెద్ద‌గా ప్ర‌యారిటీ ఇవ్వ‌ని మీడియా సంస్థ‌ల్లో ఇచ్చిన ఒక విశ్లేష‌ణ హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర ముగిసే స‌మ‌యంలో.. మొత్తం పాద‌యాత్ర జ‌రిగిన తీరును విశ్లేషిస్తూ.. జ‌గ‌న్ కు అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంద‌ని.. ఆయ‌న మాట‌లు వినేందుకు గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌లు ప్ర‌త్యేక ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని.. జ‌గ‌న్ కోసం గంట‌ల త‌ర‌బడి వెయిట్ చేస్తున్నారంటూ రాశారు.

గుంటూరు జిల్లాకు ముందు వ‌ర‌కూ సాగిన పాద‌యాత్ర‌లోనూ ప్ర‌జాస్పంద‌న ఉన్న‌ప్ప‌టికీ.. ఇంత స్థాయిలో మాత్రం లేద‌న్న మాట వినిపించింది. ఆ మాట‌కు వ‌స్తే గుంటూరు జిల్లాలో యాత్ర ముగిసిన త‌ర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో కొత్త ఉత్సాహం వ‌చ్చిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. దీనికి మిన్న‌గా తాజాగా సాగుతున్న కృష్ణా జిల్లా పాద‌యాత్ర అధికార‌ప‌క్షానికి షాకింగ్ గా మారిన‌ట్లుగా తెలుస్తోంది.

త‌మ ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల్ని ఒక్కొక్క‌టిగా చెబుతూ.. తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతున్న జ‌గ‌న్ తిట్ల‌కు జ‌నం నుంచి వ‌స్తున్న స్పంద‌న చూస్తే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీ అధికార‌ప‌క్షానికి షాక్ త‌గ‌ల‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో జ‌గ‌న్ మాట‌ల్ని శ్ర‌ద్ధ‌గా ఆల‌కించ‌టం క‌నిపించింద‌ని.. ఈ ప‌రిణామాన్ని తాము సైతం ఊహించ‌లేద‌ని స్వ‌యంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన జిల్లాగా కృష్ణాను చెప్పిన‌ప్ప‌టికీ.. కోపం వ‌స్తే మాత్రం ఓట్ల‌తో తాట తీయ‌టం వారికి కొత్తేం కాద‌ని చెబుతారు. మొత్తం 16 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న కృష్ణా జిల్లాలో 2004 ఎన్నిక‌ల ఫ‌లితాల్ని చూస్తే.. కంచుకోట లాంటి ఆ జిల్లాలో టీడీపీకి ద‌క్కిన సీట్లు కేవ‌లం రెండు మాత్ర‌మే కావ‌టం గ‌మ‌నార్హం.

అదే స‌మ‌యంలో 2009లో టీడీపీ 8 సీట్లు సాధించ‌గా.. ప్ర‌జారాజ్యం 2.. కాంగ్రెస్ ఆరు చోట్ల విజ‌యం సాధించింది. 2014లో ఉన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల కార‌ణంగా టీడీపీ 10 స్థానాల్లో విజ‌యం సాధించ‌గా.. వైఎస్సార్ కాంగ్రెస్ ఐదు స్థానాల్లో.. టీడీపీ బ‌ల‌ప‌ర్చిన బీజేపీ అభ్య‌ర్థి ఒక స్థానంలో విజ‌యం సాధించారు. గ‌ణాంకాల వారీగా చూసిన‌ప్పుడు టీడీపీకి ఎడ్జ్ ఉన్న కృష్ణా జిల్లాలో 2019 ఎన్నిక‌ల ఫ‌లితాలు మాత్రం వేరుగా ఉంటాయ‌ని.. బాబుకు షాక్ ఆ జిల్లా ఫ‌లితాల‌తోనే మొద‌ల‌వుతుంద‌న్న అంచ‌నాను వేస్తున్నారు. గుంటూరు.. కృష్ణా జిల్లాల్లో జ‌గ‌న్ కు పెరుగుతున్న ప్ర‌జాద‌ర‌ణ 2019 ఎన్నిక‌ల్లో క‌చ్ఛితంగా ప్ర‌భావం చూపించ‌టం ఖాయ‌మంటున్నారు.