Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రలో జగన్‌ కు జై !

By:  Tupaki Desk   |   5 Oct 2018 5:30 AM GMT
ఉత్తరాంధ్రలో జగన్‌ కు జై !
X
ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలం పెంచుకుంటోంది. రాయల సీమలో తిరుగులేని స్ధానంలో ఉన్న వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ - ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం - విజయనగరం - శ్రీకాకుళం ల‌లో తన పట్టును పెంచుకుంటోంది. దీనికి తార్కాణం జగన్ నిర్వహిస్తున్న పాదయాత్రకు వస్తున్న జన స్పందనే. ఉత్తరాంధ్ర జిల్లాలతో కలిపి జగన్ ఇప్పటి వరకూ 3000 కిలో మీటర్లు పాదయాత్ర చేసారు. తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రతో ప్రవేశిస్తున్న సమయంలో కొవ్వూరు - రాజమండ్రి మధ్య ఉన్న గోదావరి వంతెన కూలుతుందా అన్నంతగా ప్రజలు వచ్చారు. బుధ - గురువారాలలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల - ఇతర ప్రాంతాలలో పాదయాత్రకు ప్రజలు వేలాది సంఖ్యలో వస్తున్నారు. నెల్లిమర్ల గ్రామం కంటే పెద్దదిగాను - పట్టణం కంటే చిన్నది గాను ఉంటుంది. అయితే జగన్ పాదయాత్రతో నెల్లిమర్ల నగరంగా మారిపోయింది. జ్యూట్ పరిశ్రమకు పెట్టింది పేరైన నెల్లిమర్లలో వందలాది కార్మిక కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడి పరిశ్రమలు మూసివేయడంతో కార్మికులు కాస్త కూలీలుగా మారారు. వీరి సంక్షేమం పట్ల తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్షంగా ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో పాటు విజయనగరం జిల్లాకు చెందిన తెలుగుదేశం మంత్రులు - నాయకులు ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకత జగన్ పట్ల సానుకూలతగా మారుతోందంటున్నారు. తనకు సాధ్యమైన హామీలనే ఇస్తూ అన్ని వర్గాలకు ఉపయోగపడేలా తమ విధానాలు ఉంటాయని జగన్ ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటనల పట్ల ప్రజల నుంచి పెద్ద ఎత్తున సానుభూతి వస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో అనేక సంవత్సరాలుగా సమస్యలు తిష్ట వేసాయి. వాటి పరిష్కారం దిశగా జగన్ వాగ్దానాలు చేస్తున్నారని ఆ జిల్లాలకు చెందిన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి తోడు తెలుగుదేశం శాసన సభ్యుల - మంత్రుల అవినీతి కూడా నానాటికి పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై తెలుగుదేశం పార్టీని ఉత్తరాంధ్ర ప్రజలు నిలదీస్తున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో నాలుగేళ్లు స్నే‍హం చేసి విశాఖకు రైల్వే జోన్ కూడా తెచ్చుకోలేక పోవడం ప్రజలలో వ్యతిరేకతను పెంచిందంటున్నారు. ఈ నెపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పట్ల సానుభూతి కలసి జగన్‌ కు పట్టం కడతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.