Begin typing your search above and press return to search.

మోడీకి మరోసారి నల్లేరు మీద నడకేనా!

By:  Tupaki Desk   |   28 April 2019 1:10 PM IST
మోడీకి మరోసారి నల్లేరు మీద నడకేనా!
X
కాంగ్రెస్ పార్టీ వాళ్లేమో మోడీ మీద ప్రియాంకను పోటీలో నిలుపుతామంటూ మొదట హడావుడి చేశారు. ఆ తర్వాతేమో చేతులు ఎత్తేశారు. ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. ఇక వారణాసిలో మోడీ నామినేషన్ ర్యాలీని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అత్యంత భారీ స్థాయిలో కార్యకర్తలు - పార్టీ అభిమానులు తరలిరాగా… మోడీ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు రోజు కూడా వారణాసిలో భారీ ర్యాలీని నిర్వహించారు బీజేపీ వాళ్లు. అలా అక్కడ తమ పార్టీ ఉనికి ఏ రేంజ్లో ఉందో చాటారు.

గత ఐదేళ్లలో వారణాసికి మోడీ ఏం చేశారు? అనేది చర్చలోనే లేకుండా పోయింది! గంగా ప్రక్షాళన పూర్తి విజయవంతం అయిన దాఖలాలు అయితే లేవు. ఇక వారణాసి ప్రసిద్ధ హైందవ పుణ్యక్షేత్రం. మోడీ అక్కడ ఎంపీగా వ్యవహరిస్తూ ఉన్నా అద్భుతమైన అభివృద్ధి ఏదీ జరిగిన దాఖలాలు అయితే లేవు.

ఇక గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారికి సరైన పోటీ కూడా లేకపోవడం గమనించాల్సిన అంశం. అప్పుడు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మోడీ మీద పోటికి వచ్చారు. కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని పెట్టింది. ఎస్పీ - బీఎస్పీలూ మోడీ మీద అభ్యర్థులను ఉంచాయి. అయినా మోడీకి ఎదురు కనిపించలేదు.

కొంతలో కొంత అరవింద్ కేజ్రీవాల్ రెండు లక్షల చిల్లర ఓట్లను సంపాదించారు. ఈ సారి ఆయన కూడా మోడీపై పోటీ లో లేరు. ఒకవేళ ఎస్పీ - బీఎస్పీ - కాంగ్రెస్ లు ఉమ్మడి అభ్యర్థిగా ఎవరినైనా నిలిపి ఉంటే పోటీ కాస్త రంజుగా అయినా ఉండేది. ఆ ముచ్చటా లేదు. కాబట్టి.. వారణాసిలో మోడీకి తిరుగులేనట్టేనేమో!