Begin typing your search above and press return to search.

జనం కోరిక.. జగన్ ‘స్పందన’..

By:  Tupaki Desk   |   1 July 2019 10:14 AM GMT
జనం కోరిక.. జగన్ ‘స్పందన’..
X
ఎంత తేడా.. చంద్రబాబు హయాంకు.. నేటి జగన్ హయాంకు ఎంతలో ఎంత మార్పు.. నిజంగా ప్రజలు కోరుకున్నది ఇదే.. జగన్ చేసి చూపించారు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ సుపరిపాలన దిశగా సాగుతున్న జగన్ చేసిన ఈ పనికి ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.

చంద్రబాబు హయాంలో గ్రీవెన్స్ సెల్స్ సరిగ్గా పనిచేసేవి కావని... అధికారులను కలవాలంటే ప్రజలకు పెద్ద వ్యయ ప్రయాస అన్న విమర్శలున్నాయి. ప్రతి సోమవారం అధికారుల్లో సగం మంది హాజరు కాకుండా వేరే వేరే పనుల్లో ఉండేవారని ప్రజలు ఆరోపించేవారు.. ప్రజల ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారని విమర్శలున్నాయి.

కానీ జగన్ రాగానే పరిస్థితిలో భారీ మార్పు వచ్చింది. కొద్దిరోజుల క్రితం నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ప్రతీ సోమవారం అధికారులంతా సెలవులు పెట్టకుండా.. ఏ కార్యక్రమానికి హాజరు కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశించారు. ‘స్పందన’ కార్యక్రమం పేరిట గ్రీవెన్స్ సెల్స్ ను ఏపీ వ్యాప్తంగా జగన్ ఏర్పాటు చేశారు. ఈ సోమవారం ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా ‘స్పందన’ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తోంది. అన్ని జిల్లా కార్యాలయాలకు జనం పోటెత్తారు. భారీ సంఖ్యలో వస్తున్న ఫిర్యాదు దారులు అధికారులకు సమస్యలు చెబుతున్నారు. కొన్నింటిని అధికారులు అక్కడే పరిష్కరిస్తున్నారు. విచారిస్తున్నారు. జనాలకు కుర్చీలు వేసి మర్యాదగా ఒక్కొరొక్కరి సమస్యను వింటూ తక్షణమే అధికారులు ప్రతిస్పందిస్తుండడంతో జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ గ్రీవెన్స్ సెల్ లో పాలుపంచుకొని ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇన్నేళ్లుగా పరిష్కారానికి నోచుకోని.. మంజూరు కాని పనులు ఒక్కరోజులోనే ఏపీ వ్యాప్తంగా అవుతుండడంతో జగన్ కోరిక నెరవేరినట్టైంది. ప్రజల బాధలు తొలిగిపోయాయి.