Begin typing your search above and press return to search.

అభిమానులు లేకుండా ఐపీఎల్ మ్యాచులు ...ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   12 March 2020 6:30 PM GMT
అభిమానులు లేకుండా ఐపీఎల్ మ్యాచులు ...ఎందుకంటే ?
X
ఐపీఎల్ సీజ‌న్ వ‌స్తుందంటే క్రికెట్ అభిమానుల‌లో ఎక్క‌డ లేని ఆనందం. గ‌త ఏడాది సీజ‌న్‌ని గ్రాండ్‌గా నిర్వ‌హించిన నిర్వాహ‌కులు ఈ సీజ‌న్ కోసం అంత‌కి మించి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా కార‌ణంగా ప్రతిష్టాత్మక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 జ‌రిగే అవ‌కాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.అయితే , IPL 13 వ సీజన్ అనుకున్న ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పదేపదే స్పష్టం చేస్తున్నారు.

అయితే, శివసేన నేతృత్వం లోని మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలపై నిషేధం విధించింది. కరోనా వైరస్‌ భయంతో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వ్యతిరేకత పెరుగుతోంది.కర్ణాటక ప్రభుత్వం తాము ఎట్టి పరిస్థితుల్లో లీగ్‌ను నిర్వహించమని ప్రకటించింది. అంతేకాకుండా ఐపీఎల్ 2020 సీజన్‌ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. మ‌రో వైపు కేంద్ర ప్ర‌భుత్వం ఏప్రిల్ 15 వరకూ పర్యాటక వీసాల్ని రద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అసలు విదేశీ క్రికెట‌ర్స్ లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌లు ఎలా జ‌రుగుతాయా అనే సందేహం మొదలైంది. దీనితో ఐపీఎల్ 2020 రద్దు అవుతుందన్న అనుమానాలు మొదలైయ్యాయి.

మార్చి 29వ తేదీన ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య సీజన్ ఆరంభ మ్యాచ్ ముంబైలో జరగాల్సి ఉంది. అయితే, అభిమానులను స్టేడియాలకు రాకుండా చేసి..టీవీల్లోనే మ్యాచ్ చూసే వీలు కల్పించే విషయంపై చర్చ నడుస్తోంది. దీనిపై మహారాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఐపీఎల్‌ను వాయిదా వేయడమో..లేదా మ్యాచ్‌లను టీవీల్లో మ్యాచ్‌లను టీవీల్లో చూసేలా అభిమానులను పరిమితం చేయడమో చేయాలన్నారు. 2020, మార్చి 12వ తేదీ గురువారం జరిగే కేబినెట్‌ సమావేశంలో ఐపీఎల్‌ పై చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.