Begin typing your search above and press return to search.

అక్కడ బీజేపీకి ఫిఫ్త్ ప్లేసు వచ్చినా మీడియా మేనేజ్ మెంట్ చేసి సమాజానికి చూపించలేదా?

By:  Tupaki Desk   |   2 March 2021 9:30 AM GMT
అక్కడ బీజేపీకి ఫిఫ్త్ ప్లేసు వచ్చినా మీడియా మేనేజ్ మెంట్ చేసి సమాజానికి చూపించలేదా?
X
రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు చట్టాలను నిరోధించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నా.. రైతులు ఏమాత్రం బెదరకుండా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల వీరి ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా ఉధృతం చేసేందుకు ఆయా రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు రైతు సంఘ నాయకుడు లికాయత్ పేర్నొన్నారు.

ఇదిలా ఉండగా రైతుల ఉద్యమం రాజకీయంగా బీజేపీని దెబ్బతీస్తోన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల పంజాబ్ లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. అయితే ఆ విషయాన్ని కేంద్రం మేనేజ్ చేస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి.

పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 70 శాతం స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుకొని మొదటి స్థానంలో నిలిచింది. చివరి స్థానంలో బీజేపీ నిలిచింది. మరో పంజాబ్ పార్టీ అకాలీ దల్ రెండో ప్లేసుకు రావడం గమనార్హం. కార్పొరేషన్లలో మొత్తం 8 స్థానాల్లో ఆరింటిని కైవసం చేసుకుంది కాంగ్రెస్. మోగా, హోషియార్పూర్, కపుర్తలా, అబోహర్, పఠాన్ కోటి, భటిండా మున్సిపల్ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 53 ఏళ్ల శిరోమణి అకాలీ దల్ కంచుకోట అయినా భాటిండాలోనూ కాంగ్రెస్ గెలుపొందడం గమనార్హం.

అయితే ఈ విషయం... దేశం మొత్తంలో చాలా మందికి తెలియదు. మున్సిపల్ ఎన్నికల గురించి దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ పంజాబ్ లో జరిగిన ఈ ఎన్నికల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు పేర్కొంటున్నారు. ఢిల్లీ నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొంటున్న రైతుల్లో పంజాబ్ కు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతుల ఉద్యమంపై ఉక్కుపాదం మోపడాన్ని పంజాబ్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారని ఈ ఎన్నికలను బట్టి తెలుస్తోంది.

ఒకవేళ ఇక్కడ బీజేపీ గనుక మొదటిస్థానంలో నిలిస్తే.. ఇప్పుడు దేశమంతా కోడై కూసేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మీడియాను మేనేజ్ చేయడంలో బీజేపీకి ఉన్న తెలివితేటలు ఇతర పార్టీలకు లేవని అంటున్నారు. గత నెలలో గుజరాత్ లోని లోకల్ ఎన్నికల్లో బీజేపీ హవా అంటూ దేశమంతా ప్రచారం చేసింది ఓ వర్గం మీడియా. కానీ ప్రస్తుత పంజాబ్ ఎన్నికల గురించి ఆ మీడియా కనీసం పట్టించుకోవడం లేదు.

బీజేపీకి ఇప్పటికే సోషల్ మీడియా ఫుల్ సపోర్టు ఉందన్న వాదన ఉంది. ఇప్పుడు సాధారణ మీడియా కూడా కేంద్రానికి వంతం పాడుతుందన్నా ఆరోపణలు వస్తున్నాయి. లేకుంటే బీజేపీకి చుక్కెదురు లాంటి హెడ్డింగులతో ప్రచారం చేయొచ్చుగా..? అని కాంగ్రెస్ కు చెందిన నాయకులు విమర్శిస్తున్నారు. బీజేపీ పంజాబ్ లో 5వ స్థానానికి పడిపోయినా కూడా అది వార్త కాకపోవడమే ఈ దేశంలో దౌర్భగ్యం అని కాంగ్రెస్ వాదులు వాపోతున్నారు.