Begin typing your search above and press return to search.

గ్లాసు దెబ్బకు అల్లాడిపోతున్న బీజేపీ

By:  Tupaki Desk   |   6 April 2021 2:30 PM GMT
గ్లాసు దెబ్బకు అల్లాడిపోతున్న బీజేపీ
X
పాపం మూలిగే నక్కపై తాడిపండు పడటమంటే ఇదే. గెలుపు సంగతి పక్కన పెట్టిసినా డిపాజిట్ తెచ్చుకుంటే అదే పదివేలన్న పద్దతిలో ముక్కుతు మూలుగుతూ బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు తిరుపతి లోక్ సభ పరిధిలో. ఇలాంటి సమయంలోనే ఎన్నికల కమీషన్ నవతరం పార్టీ అభ్యర్ధి గాదె రమేష్ కుమార్ కు కేటాయించిన ఎన్నికల గుర్తు చూసిన తర్వాత బీజేపీ+జనసేన నేతలు ఠారెత్తిపోతున్నారు.

మొన్నటివరకు జనసేన వాడిన ఎన్నికల గుర్తు గాజుగ్లాసును కమీషన్ నవతరం పార్ట్ అభ్యర్ధికి కేటాయించింది. నిజానికి గుర్తు కేటాయించిన విషయం కూడా మిత్రపక్షాల నేతలకు తెలీదు. నవతరం పార్టీ అభ్యర్ది పేరుతో గోడలపై పోస్టర్లు చూసిన తర్వాతే వీళ్ళకు విషయం తెలిసింది. నిజానికి గుర్తు కేటాయించటంలో కమీషన్ తప్పేమీలేదు. అలాగే గుర్తును తీసుకోవటంలో అభ్యర్ధి తప్పుకూడా లేదు. కానీ బీజేపీ నేతలు గంగవెర్రులెత్తిపోతున్నారు.

నవతరం పార్టీ అభ్యర్ధికి గాజుగ్లాసును కేటాయించటంపై కేంద్ర ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. బీజేపీ నేతలు సునీల్ ధియోధర్, నాదెండ్ల మనోహర్, సీఎం రమేష్ ఇదే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు నవతరం అభ్యర్ధికి కేటాయించిన గుర్తును కమీషన్ వెనక్కు తీసుకునే అవకాశం లేదు. ఈ విషయంలో బీజేపీ+జనసేనల ఫిర్యాదు పనిచేయదు.

ఎందుకంటే గాజుగ్లాసు గుర్తుపై జనసేనకు ఏమీ పేటెంట్ హక్కులేదు. జనసేన కేవలం రిజిస్టర్డ్ పార్టీనే కానీ రికగ్నైజ్డు పార్టీకాదు. అందులోను తిరుపతి ఉపఎన్నికలో జనసేన పోటీ కూడా చేయటంలేదు. కాబట్టి గ్లాసు గుర్తును కమీషన్ ఎవరికైనా కేటాయించవచ్చు. సాంకేతికంగా చూస్తే గ్లాసు గుర్తు కేటాయింపులో ఎవరి తప్పిదము లేదు. కాకపోతే తమకు ఏమైనా దెబ్బ పడుతుందేమో అన్న టెన్షన్ కమలనాదుల్లో పెరిగిపోతోందంతే. మరి కమీషన్ ఏమంటుందో చూద్దాం.