Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు భారీ షాక్... ?

By:  Tupaki Desk   |   24 Jan 2022 9:38 AM GMT
ఉద్యోగులకు భారీ షాక్... ?
X
ప్రభుత్వ ఉద్యోగులు ఇపుడు దూకుడు మీద ఉన్నారు. తమ మాటే నెగ్గాలి అన్న పంతంలో ఉన్నారు. దీని మీద కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. అయితే వారి పిటిషన్ల విచారణ సందర్భంగా కోర్టు కీలకమైన వ్యాఖ్యలే చేసింది.

ఉద్యోగుల జీతాలను తగ్గించే పూర్తి హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయని విచారణ సందర్భంగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేయడం విశేషం.

అంతే కాదు పీయార్సీ వల్ల జీతం పెరిగిందా లేక తగ్గిందా ఈ సంగతి చెప్పాలని కూడా హై కోర్టు వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక వేళ జీతం తగ్గితే ఎంత మేరకు తగ్గింది అన్నది కూడా అంకెలతో సహా చెప్పాలని కోర్టు కోరడం విశేషం. మరో వైపు చూస్తే ఇంటి అద్దె అలవెన్సులలో కోత పెట్టారని ఉద్యోగులు పిటిషన్ లో పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం జరగలేదు అని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

అయితే ఈ ఆరోపణలతో హై కోర్టు ఏకీభవించలేదు, పైగా ఫిట్మెంట్ పర్సెంటేజ్ ని ఎలా సవాల్ చేస్తారు అని కూడా కోర్టు ప్రశ్నించినట్లుగా సమాచారం.

మరో వైపు ఎలాంటి నోటీసు లేకుండా హెచ్ ఆర్ సీలో కోత పెట్టారు అన్న వాదన మీద కూడా హై కోర్టు మాట్లాడుతూ ఆ హక్కులు అన్నీ ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పడం విశేషంగానే చూడాలి. ఇక ఏ డేటా లేకుండా పిటిషన్ దాఖలు చేయడం మీద కూడా కోర్టు ఆగ్రహించింది. పిటిషన్ కి చట్టబద్ధత కూడా లేదని పేర్కొంది.

ఇక మరో వైపు ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన అడ్వకేట్ జనరల్ తన వాదనను వినిపిస్తూ గ్రాస్ శాలరీ పెరిగింది అని లెక్కలతో సహా వివరించారు. మొత్తానికి చూస్తే తమ మాటే నెగ్గలాంటూ సమ్మె బాట పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు హై కోర్టు చేసిన కీలకమైన వ్యాఖ్యలు ఇపుడు భారీ షాక్ గానే చూడాలి అంటున్నారు.

మరో వైపు చూస్తే విభజన చట్టాన్ని చూపించి ఇంటి అద్దె అలవెన్సులు భారీగా పెంచాలన్న తన డిమాండ్ విషయంలో కూడా న్యాయపరమైన భరోసా ఎంత వరకూ ఉంది అన్నది కూడా ఉద్యోగులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఉద్యోగులు సమ్మె విషయంలో ఏ విధంగా అడుగులు వేస్తారో చూడాలి.అదే విధంగా ప్రభుత్వంతో చర్చలకు ఉద్యోగులు వస్తారా అన్నది కూడా ఆసక్తిని కలిగిస్తోంది