Begin typing your search above and press return to search.

ఆయన వెళ్లిపోవటం రేవంత్ కు పెద్ద దెబ్బేనట

By:  Tupaki Desk   |   16 March 2021 4:30 PM GMT
ఆయన వెళ్లిపోవటం రేవంత్ కు పెద్ద దెబ్బేనట
X
వేగంగా మారుతున్న తెలంగాణ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొందరు సీనియర్ నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోవాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉన్న తర్వాత బీజేపీలోకి చేరాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. కొండా ఎగ్జిట్ తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ కు షాకిచ్చేలా మారిందంటున్నారు.

టీడీపీ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన రేవంత్ తీరును చాలామంది పాతతరం కాంగ్రెస్ నేతలతో పాటు.. మరికొందరు బలమైన నేతలు సైతం అంగీకరించటానికి ఇష్టపడని పరిస్థితి. మంచి వాగ్దాటితో పాటు.. అవసరానికి తగ్గట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడని తత్త్వం ఆయనకు మరిన్ని చిక్కుల్ని తెచ్చి పెట్టిందంటున్నారు. పదవులు తీసుకోవటానికి ముందుండే పలువురు కాంగ్రెస్ నేతలు.. పని చేయాల్సి వచ్చే వరకు మాత్రం పత్తా లేకుండా పోవటం అలవాటుగా మారిందంటున్నారు.

ఇలాంటి వేళ.. రేవంత్ కు సన్నిహితంగా ఉంటూ.. ఆయన చేసే పోరుకు మద్దతుగా నిలిచే నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోవటం ఆయన్ను ఇబ్బంది పెడుతోందని చెబుతున్నారు. మొన్నటికి మొన్న కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యేకూన శ్రీశైలం గౌడ్ బీజేపీలోకి చేరటం.. తాజాగా కొండా పార్టీని విడిచి పెట్టి వెళ్లటం ఆయనకు ఇబ్బందికరమని చెబుతున్నారు. రేవంత్ కు దన్నుగా నిలిచే నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడిపోవటంతో ఆయనకు దక్కాల్సిన పీసీసీ చీఫ్ పదవి కూడా దక్కకుండా పోయే ప్రమాదం ఉందంటున్నారు. అధికార టీఆర్ఎస్ పై దూకుడుగా వెళుతున్న రేవంత్ కు.. తన వర్గానికి చెందిన నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోవటం ఆయన స్పీడ్ కు బ్రేకులు వేసినట్లుగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.