Begin typing your search above and press return to search.

సుందర్ పిచాయ్ కు భారీ షాక్.. మిగిలిన కంపెనీలకు భిన్నంగా గూగుల్

By:  Tupaki Desk   |   22 April 2022 3:25 AM GMT
సుందర్ పిచాయ్ కు భారీ షాక్.. మిగిలిన కంపెనీలకు భిన్నంగా గూగుల్
X
కరోనా కోట్లాది మంది కొంప ముంచింది. ఎన్నో కుటుంబాల్లో అయిన వారిని కోల్పోయేలా చేస్తే.. చాలామందికి ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూసేలా చేసింది. పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయేందుకు కారణమైంది. అదే సమయంలో.. టెక్ కంపెనీల్లో పని చేసే వారి మీద కాసుల వర్షం కురిసేలా చేయటంతో పాటు.. బోలెడన్ని అవకాశాన్ని తెచ్చి పెట్టింది.

గతానికి భిన్నంగా.. గడిచినపదేళ్లలో ఎప్పుడూ లేనంతగా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని భారీగా రిక్రూట్ చేస్తున్నాయి. భారీ ప్యాకేజీలు ఆఫర్ చేసేందుకు వెనుకాడటం లేదు.

ఇలాంటి వేళ ప్రపంచ దేశాలకు చెందిన టాప్ 10 టెక్ కంపెనీలు తమ సంస్థలకు రథసారథులుగా వ్యవహరించే సీఈవోలకు భారీగా బోనస్ లు ప్రకటించాయి. ఇందుకు భిన్నంగా గూగుల్ వ్యవహరించింది. తమ సీఈవో సుందర్ పిచాయ్ కు ఇచ్చే బోనస్ లో కోత పెట్టిన వైనం హాట్ టాపిక్ గా మారింది. కార్పొరేట్ ప్రపంచంలో ఈ వ్యవహారం ఇప్పుడు అందరి నోళ్లలో నానటమే కాదు.. ఇదో వార్తాంశంగా మారింది.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం గూగుల్ తన సీఈవోకు ఇచ్చిన బోనస్ లెక్క చూసుకుంటే.. గతంలో ఇచ్చిన దానికి 14 శాతం కోత పెట్టి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. సాధారణంగా గతంలో ఇచ్చే బోనస్ కు అదనంగా కొంత మొత్తాన్ని చేర్చి మరీ ఇవ్వటం మామూలే. కానీ.. సుందర్ పిచాయ్ కు మాత్రం గూగుల్ సంస్థ 14 శాతం బోనస్ తగ్గించినట్లుగా ఫైన్ బోల్డ్ సంస్థ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది.

బోనస్ విషయంలో కోతను ఎదుర్కొన్న సుందర్ పిచాయ్ కు గూగుల్ స్టాక్ ప్యాకేజీ భారీగా ఇవ్వటం గమనార్హం. 2020 నుంచి సుందర్ పిచాయ్ వార్షిక వేతనం రూ.14కోట్లు ఉంటే.. గడిచిన రెండు సంవత్సరాలుగా స్టాక్ ప్యాకేజీ కింద గూగుల్ రూ.1707 కోట్లు అందించినట్లుగా చెబుతున్నారు. ఇక.. ప్రపంచంలో టాప్ 10 టెక్ కంపెనీలు తమ సీఈవోలకు ఇచ్చిన బోనస్ లెక్క చూసినప్పుడు భారీగా ఉండటం గమనార్హం.

- అమెరికాకు చెందిన ప్రముఖ సెమీ కండక్టర్ ఉత్పత్తి సంస్థ "బ్రాడ్ కామ్" తమ సీఈవో తాన్ హాక్ ఎంగ్ కు ఏకంగా 1586 శాతం బోనస్ ను ఇచ్చారు.

- రెండో స్థానంలో ఒరాకిల్ సీఈవో సాఫ్రా అడా క్యాట్జ్ కు 999 శాతం భారీ బోనస్ దక్కింది

- మూడో స్థానంలో ఇంటెల్ సీఈవో పాట గ్లెసింగెర్ (713.64 శాతం) నిలిస్తే.. నాలుగో స్థానంలో యాపిల్ సీఈవో టీమ్ కుక్ (571.63 శాతం).. అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ (491.9 శాతం) ఉన్నారు.

- అత్యధికంగా బోనస్ పొందిన కంపెనీల లెక్క ఇలా ఉంటే.. మరికొన్ని ప్రముఖ కంపెనీల అందుకు భిన్నంగా తక్కువ బోనస్ లతో సరిపుచ్చాయి. సాఫ్ట్ వేర్ దిగ్గజం ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ 52.17 శాతం.. నెట్ ఫ్లిక్స్ సీఈవో రీడ్ హ్యాస్టింగ్స్ 19.68 శాతం.. సిస్కో సీఈవో చుక్ రాబిన్సన్ 9.48 శాతం.. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 5.93 శాతం పొందారు.