Begin typing your search above and press return to search.

తలలు మార్చే రోజులు వచ్చేశాయి

By:  Tupaki Desk   |   8 April 2015 12:37 PM GMT
తలలు మార్చే రోజులు వచ్చేశాయి
X
వినాయక చవితి సందర్భంగా వినాయక వ్రతకల్పం పుస్తకం చదివినప్పుడు వినాయకుడికి ఏనుగు తల ఎందుకు వచ్చిందనే దానికి ఓ కథ చెబుతారు. సున్నిపిండితో ఒక బాలుడ్ని తయారు చేసి ప్రాణం పోసిన పార్వతి అతన్ని ఇంట్లోకి ఎవరూ రాకుండా చూడాలని కోరుతుంది. తల్లి మాటను జవదాటని వినాయకుడి పరమశివుడ్ని అడ్డుకోవటం.. ఆయనకు కోపం వచ్చి కంఠం ఖండించటం జరిగిపోతాయి.

తర్వాత ఈ విషయం పార్వతికి తెలవటం.. శివుడ్ని కోరితే.. చివరకు ఏనుగు తలను తీసుకొచ్చి అమరుస్తాడు. కథగా బాగున్నా.. దాదాపు ఇలాంటి పని చేయటం సాధ్యమేనా? అంటే అసాధ్యం అంటారు. కాకపోతే.. ఏనుగు తల కాకుండా.. ఆరోగ్యంగా ఉంటూ బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి తలను.. ఒక రోగి తల స్థానంలో ఉంచేలా ఓ అరుదైన శస్త్రచికిత్సకు తెర తీస్తున్నారు. ఈ ఆపరేషన్‌ కానీ విజయవంతం అయితే.. ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణగా దీన్ని చెప్పొచ్చు. ఈ అద్భుతమైన ఆపరేషన్‌ కు సిద్ధమవుతున్నారు ఇటలీకి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ సెర్గీ కానవెరో.

ఇంతకీ తల మార్చుకోవాల్సిన అవరం ఏమిటి? ఎవరికి.. ఎందుకు.. ఆ పరిస్థితి వచ్చిందని చూస్తే.. మస్కో నగరానికి 120కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్లాదిమీర్‌ పట్టణంలో స్పిరిడొనోవ్‌ అనే 30 ఏళ్ల కంప్యూటర్‌ సైంటిస్ట్‌ తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నారు. ఈ జబ్బు కారణంగా శరీరంలోని కండరాలన్నీ పని చేయకుండా పోతాయి. చివరకు చావు తప్పదు.

దీంతో.. తనకున్న కంప్యూటర్‌ నాలెడ్జ్‌ తో.. తనకున్న జబ్బుకు సంబంధించి చికిత్స ఏమైనాఉందా? అని వెతికినప్పుడు ఇటలీ డాక్టర్‌ గురించిన సమాచారం కనిపించింది. దాన్ని విస్తృతంగా పరిశోధిస్తే.. తనకున్న రోగానికి తన తల స్థానంలో మరొకరి తల (అన్ని అవయువాలు బాగా పని చేసి బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి) అవసరమవుతోందని తేలింది.

ఈ ఆపరేషన్‌కు దాదాపు రూ.70కోట్ల వరకు అవసరమవుతుందని లెక్కేశారు. ఇందుకోసం 150 మంది డాక్టర్లు.. నర్సుల సాయంతో దాదాపుగా 36 గంటల పాటు ఈ ఆపరేషన్‌ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరి.. ఇలాంటి ఆపరేషన్లు సదరు డాక్టర్‌ ఇంతకు ముందు చేశారా? అంటే.. సదరు డాక్టర్‌ గతాన్ని ప్రస్తావిస్తూ అప్పుడెప్పుడో 45 ఏళ్ల క్రితమే ఓ కోతి తలను మరో కోతికి అమరచారని.. ఇటీవల ఇలాంటి ఆపరేషనే.. ఎలుకకు చేశారని.. వాటికి చేయగా లేనిది మనిషికి ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తున్నారు.

2016లో జరిగే ఈ ఆపరేషన్‌కు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు.. అసలు దీన్ని ఎలా చేస్తారంటూ వేలాది ఈమొయిల్స్‌ తో అడుగుతున్నారని చెబుతున్నారు. ఆపరేషన్‌ చేయించుకునేందుకు తనకూ కాస్తంత భయంగా ఉందని.. ఒకవేళ ఆపరేసన్‌ విజయవంతం అయితే.. తన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని.. ఒకవేళ తేడా వచ్చినా ఫర్లేదని.. తాను బతకాల్సిన దానికంటే ఇప్పటికి పదేళ్లు అధికంగా బతికినట్లు చెబుతున్నారు. ఈ ఆపరేషన్‌ కు తన కుటుంబం మొత్తం అంగీకరించిందని చెబుతున్నారు. మరి.. ఈ ఆపరేషన్‌ భవిష్యత్తులో మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో..?