Begin typing your search above and press return to search.
శ్రీరెడ్డికి మానవ హక్కుల కమీషన్ బాసట!
By: Tupaki Desk | 12 April 2018 1:25 PM GMTటాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై నటి శ్రీరెడ్డి చేసిన సంచలన ఆరోపణలు టాలీవుడ్ తో పాటు జాతీయవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనపై అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో శ్రీరెడ్డిని `మా` సభ్యులు బాయ్ కాట్ చేసిన విషయం విదితమే. అయినప్పటికీ - శ్రీరెడ్డి తన పోరాటాన్ని ఆపకుండా....టాలీవుడ్ లో కొందరు దర్శకనిర్మాతలు, వ్యక్తులు ....అవకాశాల కోసం అమ్మాయిలను వాడుకుంటున్నారని చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో శ్రీరెడ్డి టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత కుమారుడితో ఉన్న సన్నిహిత ఫొటోలను కూడా బయట పెట్టింది. ప్రస్తుతం శ్రీరెడ్డికి టాలీవుడ్ లోని కొందరు మహిళలతో పాటు పలు మహిళాసంఘాలు - యువజన సంఘాలు మద్దతు తెలిపాయి. తాజాగా, శ్రీరెడ్డికి జాతీయ మానవ హక్కుల కమిషన్ అండగా నిలిచింది.
సినిమాల్లో నటించకుండా శ్రీరెడ్డిని బాయ్ కాట్ చేయడం ఆమె హక్కులకు భంగం కలిగించడమేనని మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి - కేంద్ర సమాచార ప్రసారశాఖలకు హెచ్ ఆర్సీ నోటీసులు జారీ చేసింది. శ్రీరెడ్డి ఆరోపణలు - ఆమెపై నిషేధంపై సమగ్ర విచారణ జరపాలని - నాలుగు వారాల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇంతవరకు శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టకపోవడమే కాకుండా....ఆమెపైనే కేసు పెట్టడం ఏమిటని కమిషన్ ప్రశ్నించింది. శ్రీరెడ్డి కేసును కేంద్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి నోటీసులు జారీ చేయడం గమనార్హం. మరోవైపు, నిన్న ఓయూలో మాట్లాడిన శ్రీరెడ్డి....తన సమస్యపై ఇప్పటివరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించ లేదని ఆరోపించింది. మంత్రి కేటీఆర్ - ఎంపీ కవిత - జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన సమస్యపై స్పందించాలని కూడా కోరింది. ఇపుడు హెచ్ ఆర్సీ నోటీసుల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ శ్రీరెడ్డి వ్యవహారంలో తప్పక స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు.