Begin typing your search above and press return to search.

జర్నలిస్ట్ మనోజ్ మృతిపై గాంధీ ఆస్పత్రికి నోటీసులు

By:  Tupaki Desk   |   22 Jun 2020 1:30 PM GMT
జర్నలిస్ట్ మనోజ్ మృతిపై గాంధీ ఆస్పత్రికి నోటీసులు
X
తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టు మనోజ్ కుమార్ వైరస్ తో మృతి చెందడం కలకలం రేపింది. గాంధీ ఆస్పత్రిలో వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేశారని మృతుడి కుటుంబసభ్యులతో పాటు ప్రజలు.. అన్ని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. దీనికి స్పందించిన కమిషన్ గాంధీ ఆస్పత్రికి నోటీసులు పంపింది.

మనోజ్ కుమార్ వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ గాంధీ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మనోజ్ మృతి చెందాడంటూ పలువురు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మనోజ్ మృతికి పరిహారంగా రూ.కోటి పరిహారం ఇప్పించాలని, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మనోజ్ మృతిపై పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని గాంధీ ఆస్పత్రి అధికారులను ఆదేశించింది.

మనోజ్ కుమార్ మృతికి గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్య వైఖరే కారణమని ఆయన సోదరుడు సాయినాథ్ ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన వైరస్ పేషెంట్స్ ను ఆస్పత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. అందువల్లే తన సోదరుడు మనోజ్ కుమార్ మృతి చెందారని సాయినాథ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఉన్న లోపాలపై సాయినాథ్ చేసిన ఆరోపణలు కొన్ని రోజులుగా సంచలనంగా మారుతున్నాయి. గాంధీ ఆస్పత్రిలో తన సోదరుడిలాగ మరొకరు కాకూడదని న్యాయ పోరాటం చేస్తున్నట్లు సాయినాథ్ చెబుతున్నారు.