Begin typing your search above and press return to search.

భూమిపై మ‌నకు వెయ్యేళ్లే..కానీ!

By:  Tupaki Desk   |   20 Jan 2016 11:30 PM GMT
భూమిపై మ‌నకు వెయ్యేళ్లే..కానీ!
X
మనిషిగా మ‌న‌కున్న అతిపెద్ద బ‌లం మ‌న మేధ‌స్సు. బ‌ల‌హీన‌త కూడా అదే! చ‌ద‌వ‌టానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం. మాన‌వుడు త‌న మేధ‌స్సు ద్వారా సృష్టించిన వాటి ద్వారానే మ‌న నాశ‌నం సంభ‌వించ‌బోతున్న‌ది తేల్చారు. అదికూడా ఎవ‌రో దారిన‌పోయే దాన‌య్య కాదు ప్ర‌పంచంలో సుప్ర‌సిద్ధ‌మైన భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. చ‌క్రాల కుర్చీలో ఉన్న‌ప్ప‌టికీ చ‌రాచ‌ర జ‌గ‌త్తు గురించి సైన్స్ ఆధారంగా సంచ‌ల‌నాలు వెల్ల‌డించే హ్యాకింగ్ తాజాగా బీబీసీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో షాకింగ్ సీక్రెట్స్ చెప్పారు.

హాకింగ్‌ సైన్స్ మేధ‌స్సు ప్ర‌కారం భూగోళంపై మానవ జాతి మనుగడ రాబోయే వెయ్యి నుంచి పదివేల ఏళ్ల మధ్య మాన‌వుల జీవితం ఫినిష్ అయిపోతుంది. భూగోళంపై మన చాప్ట‌ర్ క్లోజ్ అయ్యేందుకు మ‌న మేధ‌స్సుతో త‌యారైన అణు బాంబుల‌తో చేసే యుద్ధం కానీ, పెద్ద ఎత్తున జ‌రుగుతున్న గ్లోబ‌ల్ వార్మింగ్ వ‌ల్ల కానీ లేదా మ‌న‌మే రూపొందించిన ఆటోమేషన్ ఆయుధాలు కూడా ఏకే 47ల కంటే ప్ర‌భావంతంగా మారి మ‌న‌ల్ని ఖ‌తం చేయ‌వ‌చ్చంట‌! ఇంతే కాదండోయ్ వివిధ వైరస్‌ లలో జన్యుమార్పిడి కారణంగా కూడా మన‌కు ముప్పు త‌ప్ప‌ద‌ని హాకింగ్‌ తేల్చేశారు.

ఇన్ని షాకులిచ్చిన హాకింగ్ కొన్ని స‌ర్‌ప్రైజ్‌లు కూడా చెప్పారు! మాన‌వ మ‌నుగ‌డ‌కు ఇన్ని ద‌రిద్రాలు ముంచుకొస్తున్నా మ‌నకోసం మ‌రెన్నో అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని సెల‌విచ్చారు. మానవ జాతికి భూమిపై ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఎదురైన ఇత‌ర‌ ఉపగ్రహాల‌పై హ్యాపీగా ఉండొచ్చ‌ట‌. అక్క‌డ కాలనీలు ఏర్పాటు చేసుకొని ఉండొచ్చ‌ని అయితే ఈ నివాస పరిస్థితులకు వందేళ్లకుపైగా పట్టవచ్చని హ్యాకింగ్ అంచ‌నా వేశారు. ఇక్క‌డ కూడా మ‌ళ్లీ షాక్ ఇచ్చారు. మనకన్నా అన్నింటా ముందుండే గ్రహాంతర వాసుల వల్ల భూమిపైనే కాదు ఇత‌ర గ్ర‌హాల్లో కూడా ముప్పు వచ్చే అవకాశం లేకపోలేదట‌.

ఇంత‌కీ ఇవ‌న్నీ హ్యాకింగ్ ఇప్పుడెందుకు చెప్పారంటే స్టీఫెన్ హాకింగ్‌కు ఇటీవ‌లే 74 ఏళ్లు నిండాయి. అంతేకాదు ప్ర‌ఖ్యాత రీత్ స్నాతకోత్సవం జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో బీబీసీ ఆయన ఉపన్యాసాన్ని రికార్డు చేసింది. గ్ర‌హంత‌ర వాసులు ఉన్నాయ‌ని హ్యాకింగ్‌కు గంపెడు భ‌రోసా ఉంద‌నే విష‌యం తెలిసిందే క‌దా.