Begin typing your search above and press return to search.

చీక‌టికి చెక్ చెప్పేసే శ‌క్తి క‌ళ్ల‌కు రానుంద‌ట‌!

By:  Tupaki Desk   |   4 March 2019 4:52 AM GMT
చీక‌టికి చెక్ చెప్పేసే శ‌క్తి క‌ళ్ల‌కు రానుంద‌ట‌!
X
చిమ్మ చీక‌టి సంగ‌తి త‌ర్వాత‌.. ఉన్న‌ట్లుండి క‌రెంటు పోతే అప్ప‌టివ‌ర‌కూ ప‌రిచ‌య‌మున్న ప‌రిస‌రాలు కాస్తా అప‌రిచితంగా మారిపోవ‌ట‌మే కాదు. ఎక్క‌డ ఏం ఉందో అర్థం కాక తెగ ఇబ్బంది ప‌డిపోతాం. ప‌రిచ‌యం ఉన్న ఇంట్లోనూ.. ప‌రిస‌రాల్లోనూ ఇలాంటి ప‌రిస్థితి ప్ర‌తి ఒక్క‌రికి కామ‌నే. అయితే.. అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక‌త‌తో పాటు.. అలుపెర‌గ‌ని రీతిలో సాగుతున్న ప‌రిశోధ‌న‌ల‌తో స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌ల దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి.

తాజాగా అలాంటి ప్ర‌యోగ‌మే ఒక‌టి విజ‌య‌వంతం అయిన‌ట్లుగా చెబుతున్నారు. చైనా సైన్స్ అండ్ టెక్నాల‌జీ వ‌ర్సిటీతో పాటు అమెరికాలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ మ‌సాచుసెట్స్ మెడిక‌ల్ స్కూల్ కు చెందిన శాస్త్ర‌వేత్త‌లు స‌రికొత్త విజ‌యాన్ని సాధించారు.

దీని ప్ర‌కారం రానున్న కొన్నేళ్ల‌లో చీక‌టిలోనూ మ‌నుషులు చూసే వీలు క‌ల‌గ‌నుంది. ఇంత‌కీ వీరి ప‌రిశోధ‌న‌లు ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చాయంటే.. తాము అభివృద్ధి చేసిన నానో క‌ణాల్ని ఎలుక క‌ళ్ల‌ల్లోకి చొప్పించి.. చీక‌ట్లోనూ అవి చూసేలా చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ ప్ర‌యోగం చేసిన ఎలుక‌ల క‌ళ్లు ఎలాంటి దుష్ప‌రిణామాన్ని ఎదుర్కోలేద‌ట‌.

ఇప్ప‌టివ‌ర‌కూ చేసిన ప్ర‌యోగాలు విజ‌య‌వంతం అయ్యాయ‌ని.. ఎలుక‌ల మీద ప‌రీక్ష‌లు స‌క్సెస్ కావ‌టంతో.. రానున్న కొద్ది రోజుల్లో మ‌నుషుల‌పై ప్ర‌యోగం చేయ‌నున్నారు. అదే జ‌రిగితే.. చీక‌ట్లోనూ సులువుగా చూసే శ‌క్తి మ‌నుషుల‌కు రానుంది. ఈ సాంకేతిక‌త‌తో సైనికుల‌కు ఎంతో సాయం చేస్తుంద‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే రాత్రిళ్లు.. అందునా చీక‌ట్లో జ‌రిపే ఆప‌రేష‌న్ల‌కు కొత్త త‌ల‌నొప్పులు రానున్నాయ‌న్న మాట‌.

ఇంత‌కీ ఈ ప్ర‌యోగాన్ని ఎలా చేశారు? ఎలాంటి ఫ‌లితాలు వ‌చ్చాయ‌న్న‌ది సాంకేతికంగా చెప్పాల్సి వ‌స్తే.. ప‌రారుణ కిర‌ణాలు చుట్టూ ఉన్న‌ప్ప‌టికీ వాటిని చూసే శ‌క్తి క‌ళ్ల‌కు ఉండ‌దు. వేవ్ లెంత్ చాలా ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆ కిర‌ణాల‌ను రెటీనాలోని కాంతి గ్రాహ‌కాలు త‌మ‌లో ఇముడ్చుకోలేవు. దీంతో చీక‌ట్లో చూడ‌లేని ప‌రిస్థితి. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు ప్ర‌త్యేక‌మైన నానో క‌ణాల్ని అభివృద్ధి చేశారు.

వాటిని ఎలుక‌ల క‌ళ్ల‌ల్లోకి ప్ర‌త్యేక‌మైన సూదిమందు ద్వారా ఎక్కించారు. దాంతో ఎలుక‌ల నేత్ర ప‌ట‌లాన్ని ప‌రారుణ కాంతి తాకిన‌ప్పుడు.. నానో క‌ణాలు గ్ర‌హించి వాటిని త‌క్కువ త‌రంగ దైర్ఘ్యం ఉన్న కాంతిగా మార్చాయి. కాంతి గ్రాహ‌కాలు స‌ద‌రు కాంతిని త‌మ‌లో ఇముడ్చుకొని మెద‌డుకు సంకేతాలు పంపాయి. దీంతో.. సాధార‌ణ కాంతి త‌ర‌హాలోనూ ప‌రారుణ కిర‌ణాల‌ను ఎలుక‌లు చూడ‌గ‌లిగిన‌ట్లుగా శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ఈ ప్ర‌యోగంతో ఎలుక‌ల‌కు ఎలాంటి ఇబ్బంది క‌లుగ‌లేద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు.