Begin typing your search above and press return to search.

మనోడి నివాళులకు వందలాది అమెరికన్లు..

By:  Tupaki Desk   |   27 Feb 2017 1:42 PM GMT
మనోడి నివాళులకు వందలాది అమెరికన్లు..
X
తలకెక్కిన జాత్యాహంకారం.. హద్దులు దాటిన ఆవేశం.. మానవత్వం మంటగలిసి.. మనిషిలోని మృగం బయటకు వచ్చిన వేళ.. ఎలాంటి కారణం లేకుండా మనోడైన శ్రీనివాస్ కూఛిబొట్ల దారుణంగా జాతి వివక్ష హత్యకు గురి కావటం తెలిసిందే. విద్వేషాల్ని రెచ్చగొడుతూ.. తెంపరి మాటలతో అమెరికా లాంటి దేశంలో అంతులేని వివక్షకు తెర తీసేలా ప్రేరేపిస్తున్న ట్రంప్ పుణ్యమా అని.. ప్యూరింటన్ లాంటి తాగుబోతులు బరి తెగిస్తున్న వైనం ఇప్పుడు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.

స్నేహితుడితో కలిసి తన మానాన తాను ఉన్నవేళలో.. జాత్యాంహకార వ్యాఖ్యలు చేసి.. మాటలతో ఫ్యూర్టింటన్ రెచ్చగొట్టినా శ్రీనివాస్ రెచ్చిపోలేదు. అయినప్పటికీ కసి తీరని మానవమృగం తుపాకీ తీసుకొచ్చి.. ‘‘ఈ దేశం నుంచి వెళ్లిపోండి.. తీవ్రవాదుల్లారా’’ అంటూ విద్వేష వ్యాఖ్యలతో కాల్పులు జరపటమే కాదు.. నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న తర్వాత వేరే చోటకు వెళ్లి.. మధ్యప్రాచ్యం వారిని చంపేశానని గొప్పలు చెప్పుకున్న వైనం కనిపిస్తుంది.

ఇంత దారుణంలోనూ.. అమెరికా సమాజంలో నాగరికులు చాలా మందే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేసేలా.. అక్కడి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. శ్రీనివాస్ మీద కాల్పులు జరిపి.. అతడి స్నేహితుడు అలోక్ మీద కాల్పులు జరిపే సమయానికి.. అక్కడే ఉన్న అమెరికన్ యువకుడు అయాన్ గ్రిల్లార్ట్ ప్రాణాలకు తెగించి అడ్డుకోవటమే కాదు.. కసాయి బుల్లెట్టుకు తీవ్రంగా గాయపడ్డాడు. నేటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అమెరికా సమాజం పూర్తిగా విద్వేషపు ఊబిలో దిగబడలేదన్న విషయాన్ని రుజువు చేశారు.

ఇదిలా ఉంటే.. శ్రీనివాస్ కూఛిబొట్ల ఆత్మకు శాంతి కలిగేలా.. అతడికి నివాళులు అర్పిస్తూ.. శాంతిర్యాలీని నిర్వహించారు. స్థానిక నగర భారత సమాజం ఏర్పాటు చేసిన ఈ ర్యాలీలో ప్రవాస భారతీయులు మాత్రమే కాదు.. వందలాది అమెరికన్లు కూడా పాల్గొని తమ సంఘీభావాన్ని తెలపటమే కాదు.. జరిగిన దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. కాల్పుల ఉదంతంలో కాపాడబోయి గాయపడిన వ్యక్తి సోదరి సైతం ఈర్యాలీలో పాల్గొనటం గమనార్హం.

కాల్పుల సమయంలో శ్రీనివాస్ చెంతనే ఉన్న అతని ప్రాణ స్నేహితుడు అలోక్ ఈ ర్యాలీకి నేతృత్వం వహించాడు. తన ప్రాణస్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న అతడు మాట్లాడుతూ.. ‘‘ఒక అర్థం లేని ఆగ్రహానికి నా ప్రాణ మిత్రుడు బలయ్యాడు. 2008 నుంచి అతను నాకు స్నేహితుడు. అతను చాలా మంచివాడు. దయార్థ హృదయుడు. ప్రేమతో పాటు ప్రతిఒక్కరి పట్ల దయతో వ్యవహరిస్తుంటాడు. ఏ రోజు ఒక్కరి మీద కూడా ఆగ్రహం చెందిన వైనం చూడలేదు. అనవసరంగా ఒక్క మాట మాట్లాడరు. అర్థం లేని విషయాల్ని అస్సలు ప్రస్తావించడు. గాసిప్ లాంటి మాటలు అసలు అతని నోటి నుంచి రావు. అలాంటి వ్యక్తి లేకపోవటం నిజంగా బాధాకరం’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

కాల్పుల సమయంలో రక్షించే ప్రయత్నం చేసి గాయపడి..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిల్లార్డ్ సోదరి మాట్లాడుతూ.. ‘‘మీరు ఏ రంగువాళ్లన్నది ముఖ్యం కాదు. అందరం సమానం’’ అని వ్యాఖ్యానించారు. శాంతి ర్యాలీకి.. సమావేశానికి వందలాది మంది అమెరికన్లు హాజరయ్యారు. శ్రీనివాస్ మృతికి నివాళులు అర్పించారు. శాంతి ర్యాలీకి.. స్థానిక నేతలు.. ఉన్నతాధికారులు హాజరై తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. జరిగిన దారుణాన్ని ప్రతిఒక్కరూ ఖండించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/