Begin typing your search above and press return to search.

వందేళ్ల వయసులో ఆరోగ్య సమస్యలు లేకుండా? సీక్రెట్ చెప్పేసిన పెద్దాయన

By:  Tupaki Desk   |   31 March 2022 4:34 AM GMT
వందేళ్ల వయసులో ఆరోగ్య సమస్యలు లేకుండా? సీక్రెట్ చెప్పేసిన పెద్దాయన
X
అవును ఆయనకు వందేళ్లకు పైనే. అయినా.. ఇప్పటికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవనాన్ని సాగించటం సాధ్యమేనా? అంటే.. అవునని చెప్పటమే కాదు.. దాని వెనుకున్న రహస్యాన్ని చెప్పేశారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. ఇటీవల ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న బాబా శివానంద్ జీ.

పద్మ పురస్కారాన్ని అందుకోవటం కోసం వందేళ్లకు పైనే వయసు ఉన్న ఆయన.. పురస్కార వేదిక వద్దకు హుషారుగా నడుచుకుంటూ వెళ్లిన వైనం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించటమే కాదు.. ఆయన ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి వ్యక్తమయ్యేలా చేసింది. అంతేకాదు.. తాను పురస్కారాన్ని తీసుకోవటానికి ముందు రాష్ట్రపతి ముందు ప్రణమిల్లిన వైనం ఆకట్టుకునేలా చేసింది.

ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చెందిన శివానంద్ జీ.. కబీర్ నగర్ లో ఉంటారు. ఆయన ఒక చిన్న ప్లాట్ లో నివసిస్తుంటారు. యోగా రంగంలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న శివానంద్ జీ.. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవటానికి కారణాల్ని తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఆయనేం చెప్పారంటే.. యోగా వల్లే తాను ఇంత ఆరోగ్యంగా ఉన్నానని ఆయన చెబుతారు. యోగాతో ఏకాగ్రత పెరుగుతుందని.. జీవన నాణ్యత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరు ఆరు గంటల పాటు నిద్రపోవాలని.. ఆహారం తక్కువగా తీసుకోవాలని.. నూనెల్ని ఎక్కువగా వినియోగించొద్దని.. కోరికల్ని నియంత్రించుకుంటే సమస్యలు
వాటంతటవే దూరమవుతాయని చెప్పారు. తన దినచర్య గురించి చెబుతూ..

- రోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తా. కాలకృత్యాలు తీర్చుకొని కనీసం అరగంట పాటు యోగా చేస్తా.
- ఒకప్పుడు మూడు గంటల పాటు యోగా చేసేవాడ్ని.. వయసు పైబడిన తర్వాత అరగంటకు పరిమితమయ్యారు. స్నానం వంటివి పూర్తి చేసుకొని పూజ చేస్తాను.
- ఉదయం గోరువెచ్చని నీరు తాగుతా. రెండు రొట్టెలు.. ఒక కాయగూర అల్పాహారం తీసుకుంటా.
- ఉడకబెట్టిన పదార్థాలనుసాయంత్రం ఆహారంగా తీసుకుంటా. రాత్రి 8 గంటలకు నిద్ర పోతా.
- నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు మా అమ్మానాన్నలు నన్ను గురువు వద్దకు తీసుకెళ్లారు. ఆయన నుంచి ప్రేరణ పొంది యోగా చేస్తున్నాం. ఆరేళ్ల వయసులో తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నా. యోగాకు మాత్రం దూరం కాలేదు.
- పురస్కారం తీసుకునే సమయంలో నాకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అని అడిగారు. కాస్తంత వినికిడి సమస్య తప్ప మరే ఇబ్బంది లేదని ఆయనకు చెప్పా.