Begin typing your search above and press return to search.

హ‌ర్వే హ‌రికేన్ దెబ్బ‌కు టెక్సాస్ విల‌విల‌

By:  Tupaki Desk   |   28 Aug 2017 4:12 AM GMT
హ‌ర్వే హ‌రికేన్ దెబ్బ‌కు టెక్సాస్ విల‌విల‌
X
ప్ర‌కృతి వైప‌రీత్యం ప్ర‌పంచానికి పెద్ద‌న్న అయిన అమెరికాను వ‌ణికిస్తోంది. ఏకంగా 60 ల‌క్షల మంది అమెరిక‌న్లు కిందామీదా ప‌డుతున్నారు. హార్వే హ‌రికేన్ ధాటికి టెక్సాస్ విల‌విల‌లాడిపోతుంటే.. దీని ప్ర‌భావం మ‌రో వారం పాటు ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూఐదుగురు ప్రాణాల్ని తీసిన హార్వే హ‌రికేన్.. మ‌రో 14 మంది గాయ‌ప‌డేలా చేసింది.

ఈ పాడు హ‌రికేన్ కార‌ణంగా టెక్సాస్ అత‌లాకుత‌ల‌మైంద‌ని.గంట‌కు130 మైళ్ల వేగంతో వీస్తున్న మాయ‌దారి గాలుల‌తో చెట్లు.. విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. ఇళ్లు ధ్వంస‌మ‌వుతున్నాయి. క‌నీసం 3 లక్ష‌ల ఇళ్ల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయిన‌ట్లు తెలుస్తోంది.

హుస్ట‌న్‌.. హారిస్ కౌంటీల‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 20 అంగుళాల మేర వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లుగా చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వంద సెంటీమీట‌ర్ల వ‌ర‌కూ వ‌ర్ష‌పాతం న‌మోదు కానుంద‌ని.. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. హార్వే హ‌రికేన్ విధ్వంసం కార‌ణంగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కూలిపోయిన చెట్లు.. విద్యుత్ స్తంభాల్ని తీసివేయ‌టానికి.. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఏర్పాట్లుచేసేందుకు 1800 మందితో కూడిన సైన్యం రంగంలోకి దిగింది. అదే స‌మ‌యంలో హార్వే హ‌రికేన్ ధాటికి ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు సాయంగా ఉండ‌టానికి.. క‌నిపించ‌కుండా పోయిన వారిని వెతికేందుకు మ‌రో వెయ్యి మంది స‌హాయ‌క సిబ్బందిని రంగంలోకి దించిన‌ట్లుగా టెక్సాస్ గ‌వ‌ర్న‌ర్ గ్రెగ్ అబాట్ వెల్ల‌డించారు.

హార్వే హ‌రికేన్ సృష్టించిన బీభ‌త్సంతో ప్ర‌భావితం కానివారు.. రంగం అంటూ ఏమీ లేద‌ని చెబుతున్నారు. బ్ర‌జోస్ న‌దిలో నీటిమ‌ట్టం పెర‌గ‌టంతో మునిగిపోయే ప్ర‌మాదం ఉన్న మూడు జైళ్ల నుంచి 4500 ఖైదీల‌ను వేరే జైళ్ల‌కు త‌ర‌లించారు. దాదాపు ప‌ద‌మూడేళ్ల క్రితం 2004లో ఫ్లోరిడాను వ‌ణికించిన చార్లీ హ‌రికేన్ త‌ర్వాత అమెరికాను అంత‌లా ఇబ్బంది పెడుతున్న హ‌రికేన్‌హార్వీనేన‌ని చెబుతున్నారు. తాజా హార్వే హ‌రికేన్ కార‌ణంగా పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసం కావ‌టంతో పాటు జ‌న‌జీవ‌నం తీవ్రంగా స్తంభించిపోయిన‌ట్లుగా చెబుతున్నారు.