Begin typing your search above and press return to search.

రిక్షాలో లాక్కుంటూ భార్య శవాన్ని 45కి.మీ. తీసుకెళ్లాడు

By:  Tupaki Desk   |   21 Sep 2019 5:22 AM GMT
రిక్షాలో లాక్కుంటూ భార్య శవాన్ని 45కి.మీ. తీసుకెళ్లాడు
X
అపరిచితులతో స్నేహాలు.. చాటింగ్ లు.. సాయం చేయటం కోసం ఎన్నో ప్రయత్నాలు.. ఇలాంటివెన్నో ఈ డిజిటల్ యుగంలో నిత్యం కనిపిస్తుంటాయి. అదే సమయంలో కంటి ముందు మనిషి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా సాయం చేయటానికి చేతులు రాని దుర్మార్గం అంతకంతకూ పెరిగిపోతోంది. తాజా ఉదంతం ఇదే కోవకు చెందింది. ఉత్తరప్రదేశ్ లోని ఒక కార్మికుడి ఉదంతం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

మానవత్వం చచ్చిపోతుందా? చనిపోయిన మనిషిని గౌరవప్రదంగా అంతిమసంస్కారాలు చేయలేని దుస్థితి అంతకంతకూ పెరగటం ఏమిటన్న ప్రశ్న తొలిచేలా చేస్తోంది. యూపీలోని అలహాబాద్ - శంకర్ ఘడ్ హైవేపై ఒక ట్రాలీ రిక్షాలో ఒక శ్యక్తి శవాన్ని లాకెళుతున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఎందుకలా చేస్తున్నాడన్నది చూస్తే.. దాయ్ కరానాలో కార్మికుడిగా పని చేసే కల్లూ దాయికర్ సతీమణి సోనాదేవి. ముగ్గురు పిల్లల తల్లైన ఆమెకు ఇటీవల తలకు గాయమైంది. కొన్ని రోజులకు తగ్గింది. తాజాగా ఆమెకు జ్వరం వచ్చింది. అదే సమయంలో తలకు తగిలిన గాయం సమస్యగా మారింది.

దీంతో ఆమెను స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రి (ఎస్ ఆర్ ఎన్)కి తీసుకెళ్లాడు. ఐదు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. తమ ఊరికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని అతడు ఆసుపత్రి సిబ్బందిని కోరాడు.అయితే.. వారు ముందుకు రాలేదు. దీంతో.. ఏం చేయాలో తోచని అతడు.. పిల్లల్ని బస్సులో పంపి.. భార్య శవాన్ని రిక్షాలో వేసుకొని అలహాబాద్ నుంచి 45 కి.మీ. దూరంలో ఉన్న తన ఇంటికి తోసుకుంటూ తీసుకెళ్లాడు. ఈ ఉదంతం మీడియాలో వచ్చిన తర్వాత.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. సర్దుకున్న ఆసుపత్రి వర్గాలు.. సదరు వ్యక్తి తమ వద్దకు తీసుకురాలేదని... మృతురాలికి తాము వైద్యం చేయలేదని చెప్పుకుంటున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్ గా మారింది.