Begin typing your search above and press return to search.

డాడీలను చితగ్గొట్టే ‘‘మమ్మీ’’ల దేశం

By:  Tupaki Desk   |   27 July 2016 10:30 PM GMT
డాడీలను చితగ్గొట్టే ‘‘మమ్మీ’’ల దేశం
X
‘‘ప్రపంచమంతా పురుషాధిక్య సమాజం ఉందని అంతా అనకుంటుంటారు. కానీ.. ఇంట్లోకి వెళ్లి చూస్తే ఇల్లాలి డామినేషన్ ఎంతుంటుందో తెలుస్తుంది’’ అన్నాడొక పెద్దాయన. ఆయన మాటా నిజమే అనుకోండి. అయితే.. ఈ డామినేషన్ మాటల వరకే అయితే ఫర్వాలేదు. చేతల వరకు వచ్చి చెంప చెళ్లుమనిపించే స్థాయిలో ఉంటే మాత్రం కష్టమే. తాగొచ్చి పెళ్లాలను కొట్టే భర్తలతో పాటు తాగొచ్చినందుకు పెళ్లాం చేతిలో తన్నులు తినే భర్తలూ ఉన్నారు. కానీ.. పెళ్లాల చేతిలో దెబ్బలు తినే భర్తల కంటే పెళ్లాలను కొట్టే భర్తలే ఎక్కువ. ప్రపంచమంతా దాదాపుగా ఇదే పరిస్థితి. కానీ.. ఈజిప్టులో మాత్రం సీను రివర్సులో ఉందట. అక్కడ డాడీలను చితగ్గొట్టే ‘మమ్మీ’లు ఎక్కువైపోయారట.

భార్యల చేతిలో తన్నులు తింటున్న భర్తల సంఖ్య విషయంలో ప్రపంచంలో ఇంకే దేశమూ ఈజిప్టుకు సమీపంలో లేదు. ఈజిప్టు ఫ్యామిలీ లా కోర్టు రిలీజ్ చేసిన వివరాల ప్రకారమే అక్కడ ఏకంగా 28 శాతం భార్యలు తమ భర్తలను చితగ్గొట్టేస్తున్నారట. వీరిలో 66 శాతం మంది ఆల్రెడీ విడాకులు కోరుతూ కేసులు వేసిన వారేనట.

మొగుళ్లను ఎలా కొడుతున్నారంటే...

ఫ్యామిలీ లా కోర్టు దీనిపై ఇచ్చిన నివేదికలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలనూ వెల్లడించింది. భర్తలను కొట్టడానికి భార్యలు ఏమేం ఉపయోగిస్తున్నారో కూడా చెప్పింది. కొందరు చెప్పు తీసి కొడుతుంటే ఇంకొందరు చాకుతో కూడా పొడిచేస్తున్నారట. బెల్టులతో బాదడం.. సూదులతో పొడవడం కూడా చేస్తున్నారట. అంతేకాదు.. కొందరు మత్తు మందిచ్చి పడుకోబెట్టి మరీ పగ తీర్చుకుంటున్నారట.

ఇండియా కొంత నయం..

ఈ విషయంలో ఈజిప్టు తరువాత అమెరికాలో ఇలా భర్తలను బాదే మహిళలు 23 శాతం మంది ఉండగా.. బ్రిటన్ లో 17.. ఇండియాలో 11 శాతం ఉన్నారట. అయితే... భర్తలను ఇంతగా బాదేస్తున్న ఈజిప్టు మహిళలు కూడా ఏమంత సుఖపడిపోవడం లేదు. 2013లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇచ్చిన నివేదిక ప్రకారం అక్కడ 47 శాతం మంది మహిళలు గృహహింస బాధితులేనట. ఆ లెక్కన ఆలోచిస్తే భర్తలను కొడుతున్న భార్యల కంటే భార్యలను కొడుతున్న భర్తలే ఎక్కువని అర్థమవుతోంది.