Begin typing your search above and press return to search.

'ఆడవారికి ఇచ్చిన ఆ కానుకలపై భర్తకు హక్కు లేదు'

By:  Tupaki Desk   |   16 Dec 2021 4:00 PM IST
ఆడవారికి ఇచ్చిన ఆ కానుకలపై భర్తకు హక్కు లేదు
X
ఆడవారికి ఇచ్చిన కానుకలపై భర్తకు హక్కు లేదని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆమెకు తల్లిదండ్రులు ప్రేమతో ఇచ్చిన వస్తువులపై అత్తింటి వారికి ఎలాంటి అధికారం ఉండబోదని స్పష్టం చేసింది. వరుడు, ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి డిమాండ్ లేనప్పుడు అవి వరకట్నంగా ఎలా భావిస్తారని ప్రశ్నించింది.

కన్నవారు ఆమెకు ప్రేమతో ఇస్తే... అది కట్నం అవుతుందా అని అడిగింది. ఓ విడాకుల కేసులో భాగంగా భర్త దాఖలు చేసిన పిటిషన్ పై కేరళ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

కేరళకు చెందిన దంపతులు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు న్యాయవాదుల సాయంతో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ తర్వాత వరకట్న నిషేధ అధికారి వీరి కేసుపై పలు ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని సవాలు చేస్తూ... ఆ భర్త హైకోర్టును ఆశ్రయించారు. దంపతుల విడాకుల కేసులో భాగంగా వరకట్న నిషేధ అధికారి ఉత్తర్వులను సవాలు చేస్తూ భర్త దాఖలు చేసిన ఈ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది.

దంపతుల విడాకుల కేసులో భాగంగా వరకట్న చట్టం నిబంధనలను హైకోర్టు ప్రస్తావించింది. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం తప్పని పేర్కొంది. అంతేకాకుండా అమ్మాయికి పుట్టింటి వాళ్లు ఇచ్చిన కానుకలు వరకట్నం కిందకు రావని స్పష్టం చేసింది. వరుడు, అతడి తరఫు వాళ్లు డిమాండ్ చేయనప్పుడు వాటిని కట్నం కింద భావించలేమని వ్యాఖ్యానించింది.

తల్లిదండ్రులు ప్రేమగా... కూతుర్లకు ఇచ్చే కానులకపై అత్తింటి వారికి అధికారం ఉండదని చెప్పింది. అంతేకాకుండా వాటిపై పూర్తి అధికారం ఆమెకే ఉంటుందని ఈ సందర్భంగా వివరించింది.

వరకట్న నిషేధ చట్టం అమల్లోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా కూడా కట్నం ఇవ్వడం ఆగడం లేదు. అంతేకాకుండా ఈ వరకట్న భూతానికి ఇప్పటికే ఎంతోమంది ఆడవారు బలయ్యారు. ఇక పెళ్లి తర్వాత తమకు కట్నం సరిపోదంటూ... అదనపు కట్నం తీసుకురావడం కోసం ఎంతోమంది భర్తలు... తమ భార్యను కాల్చుకుతింటూనే ఉన్నారనడంలో సందేహం లేదు.

చాలామంది ఆడవారు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. నిజానికి వరకట్నం నిషేధిత చట్టంలో ఆడవారికి అనుకూలంగా ఎన్నో నిబంధనలు చేశారు. కానీ అవి పూర్తి స్థాయిలో అమల్లో లేకపోవడం బాధాకరం. అయితే ఓ వ్యక్తి తన భార్యకు వచ్చిన కానుకలపై హక్కు తనకు ఉంటుందా? అనే నేపథ్యంలో కేరళ న్యాయస్థానం ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.