Begin typing your search above and press return to search.

బిచ్చమెత్తి అయినా మనోవర్తి ఇవ్వాల్సిందేనట

By:  Tupaki Desk   |   14 July 2016 8:08 AM GMT
బిచ్చమెత్తి అయినా మనోవర్తి ఇవ్వాల్సిందేనట
X
పెళ్లి చేసుకోవటం.. ఏదైనా తేడా వస్తే విడాకులు ఇవ్వటం ఈ మధ్యన కామన్ అయిపోయింది. విడాకుల సెటిల్ మెంట్లో భాగంగా భార్యకు మనోవర్తి ఇవ్వాల్సిన పరిస్థితి. కొన్ని సందర్భాల్లో తప్పించి మిగిలిన సందర్భాల్లో విడాకులు ఇచ్చిన భర్త.. తన మాజీ భార్యకు మనోవర్తి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించాల్సిన మనోవర్తిని తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని.. ఎగగొట్టటానికి అవకాశమే లేదని తేల్చి చెప్పింది మద్రాస్ హైకోర్టు. అవసరమైతే బిచ్చం ఎత్తుకొని అయినా భార్యకు చెల్లించాల్సిన మనోవర్తిని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొనటం గమనార్హం.

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన సెల్వరాజన్.. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టికి చెందిన శ్రీరంగ సుభద్రలు పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల కాపురం తర్వాత వారి మధ్య గొడవలు పెరిగి విడాకులు తీసుకున్నారు. తన జీవనభృతి కోసం సుభ్రద చేసిన విన్నపానికి స్పందించిన కోర్టు.. ప్రతి నెల రూ.10వేలు చొప్పున ఇవ్వాలని.. నష్టపరిహారంగా రూ.50వేలు ఇవ్వాలని సెల్వరాజన్ ను ఆదేశించింది. తనకు ఉద్యోగం లేదని... తాను మనోవర్తిని ఇవ్వలేనంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు సెల్వరాజన్. కేసు పూర్వాపరాల్ని పరిశీలించిన కోర్టు.. మనోవర్తిని ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇవ్వాల్సిందేనని.. అవసరమైతే.. అడుక్కొని అయినా మాజీ భార్యకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. సో.. విడాకులు ఇచ్చే మగాళ్లు కాస్త వెనుకా ముందు చూసుకోండి. ఊరికే తొందరపడకండి.