Begin typing your search above and press return to search.

నడిరోడ్డు మీద భార్యను హత్య చేసిన భర్త.. నిర్దోషిగా తేల్చిన హైకోర్టు.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   12 Feb 2022 3:29 AM GMT
నడిరోడ్డు మీద భార్యను హత్య చేసిన భర్త.. నిర్దోషిగా తేల్చిన హైకోర్టు.. ఎందుకంటే?
X
తనతో కలిసి ఉండని భార్యను.. నడి రోడ్డు మీద చంపేశాడో భర్త. సుదీర్ఘకాలం విచారణ సాగిన ఈ కేసులో నిందితుడైన భర్తను నిర్దోషిగా పేర్కొంటూ ముంబయి హైకోర్టు ఇచ్చిన తీర్పు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ భార్యను చంపిన భర్తను నిర్దోషిగా ముంబయి హైకోర్టు ఎందుకు తీర్పును ఇచ్చింది? దానికి కారణం ఏమిటి? అన్న వివరాల్లోకి వెళితే.. విషయం చాలానే ఉందన్న విషయం అర్థమవుతుంది. అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..

నందు అనే వ్యక్తికి శకుంతల అనే మహిళకు పెళ్లైంది. వారి పదిహేనేళ్ల వైవాహిక జీవితంలో వీరికి ఇద్దరు కొడుకులు.. ఒక కుమార్తె జన్మించారు. అనంతరం.. వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి ఎక్కువ కావటంతో నాలుగేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. భర్త నందు కూలీ పని చేసుకుంటూ ఉండేవాడు. ఇదిలా ఉండగా.. 2009 ఆగస్టు 28న నందు తన పనికి వెళుతున్న వేళలో.. అతడి భార్య శకుంతల వెంబడించింది. స్థానికంగా ఉన్న బస్సు డిపో వద్దకు చేరుకున్నంతనే.. భర్త చొక్కా కాలర్ పట్టుకొని బండ బూతులు తిట్టటమే కాదు.. పదే పదే నపుంసకుడిగా తిట్టసాగింది. అతను నపుంసకుడు కాబట్టే తాను విడిగా ఉన్నానని.. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లుగా సమర్థించుకుంది.

తనను అన్నేసి మాటలు అంటున్నా.. మొదట్లో ఊరుకున్న నందు.. తర్వాత మాత్రం సహనం కోల్పోయాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన నందు.. భార్యను విచక్షణరహితంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడక్కడే మరణించింది. దీంతో అతడి మీద హత్యానేరం మోపుతూ ఖైదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ సుదీర్ఘంగా సాగింది. నందు తరఫు న్యాయవాది శ్రద్దా సావంత్ తన వాదనలు వినిపిస్తూ.. నడి రోడ్డు మీద.. రద్దీగా ఉండే ప్రాంతంలో అదే పనిగా నపుంసకుడిగా పదే పదే ప్రస్తావించటం వల్లే.. నిందితుడు రెచ్చిపోయాడని పేర్కొన్నారు. ముగ్గురు పిల్లల తండ్రిని.. అదే పనిగా అతడి గౌరవానికి భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేయటంతో ఆగ్రహానికి గురయ్యాడన్నారు.

ఇదిలా ఉంటే ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపిస్తూ.. మరణించిన శకుంతలపై పడి కత్తిపోట్లు.. గాయాల్ని ప్రస్తావించారు. నందు సంయమనం పాటించాల్సి ఉందన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న ముంబయి హైకోర్టు ధర్మాసం.. హత్యకు దారి తీసిన పరిస్థితుల్ని లోతుగా విశ్లేషించింది.

ముగ్గురు ఎదిగిన పిల్లలకు తండ్రి.. తన మానాన తాను పోతుంటే.. రోడ్డు మీద ఆడ్డుకోవటం.. చొక్కా పట్టుకోవటం.. తీవ్రంగా దూషించటం.. అదే పనిగా నపుంసకుడిగా పేర్కొనటంతో అవమానంగా భావించాడని పేర్కొంది. అతడ్ని అదే పనిగా రెచ్చగొట్టటం వల్లే భార్య మీద దాడికి దిగినట్లుగా పేర్కొన్నారు. ఈ వాదనకు తగ్గట్లే.. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్ష్యులు సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు.

ఇరు వర్గాల వాదనలు.. ప్రత్యక్ష సాక్ష్యుల సాక్ష్యాన్ని విన్న ధర్మాసనం తుది తీర్పును ఇచ్చింది. అందరి ముందు ఏ పురుషుడినైనా నపుంసకుడిగా పేర్కొంటూ అవమానంగా భావిస్తారని పేర్కొంటూ.. జస్టిస్ సాధనా జాదవ్.. జస్టిస్ ప్రథ్వి చవాన్ లతో కూడిన ధర్మాసనం.. నందును నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేసింది.