Begin typing your search above and press return to search.

హీటెక్కిన హుజూర్‌ న‌గ‌ర్‌!

By:  Tupaki Desk   |   25 Sep 2019 2:30 PM GMT
హీటెక్కిన హుజూర్‌ న‌గ‌ర్‌!
X
హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక అన్ని ప్ర‌ధాన పార్టీల‌కు అగ్నిప‌రీక్ష‌గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్‌ - టీఆర్ ఎస్ పార్టీలు దీనిని అత్యంత ప్ర తిష్టాత్మ‌కంగా భావిస్తున్నాయి. ఎన్నిక‌ల బ‌రిలో అమీతుమీ తేల్చుకు నేందుకు అస్త్ర‌శ‌స్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీంతో ఈ ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ హుజూర్‌ న‌గ‌ర్‌ లో ఈసారి గులాబీ జెండా ఎగుర‌వేయాల‌ని అధికార టీఆర్ ఎస్ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఇందుకు త‌గ్గ‌ట్టుగానే అన్ని పార్టీల కంటే ముందుగానే త‌మ పార్టీ అభ్య‌ర్థిగా సైదిరెడ్డిని ప్ర‌క‌టించి - ప్ర‌చారంలో దూసుకుపోతోంది టీఆర్ ఎస్‌. అంతేగాక సైదిరెడ్డి గెలుపు బాధ్య‌త‌ను ఆ పార్టీ సీనియ‌ర్‌ నేత - ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌ రెడ్డికి అప్ప‌గించారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.

హుజూర్‌ న‌గ‌ర్‌ లో అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో టీఆర్ ఎస్ ఇన్‌ చార్జిగా ప‌ల్లాను నియ‌మించారు. ఎన్నిక‌ల వ్యూహాన్ని ప‌క్కాగా అమ‌లు చేసే బాధ్య‌త‌ను ఆయ‌న భుజ‌స్కంధాల‌పై పెట్టారు. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కి హుజూర్‌ న‌గ‌ర్‌ ఉప ఎన్నిక పెద్ద స‌వాల్‌ గా మారింది. ఎలాగైనా త‌న సిట్టింగ్ స్థానాన్ని ద‌క్కించుకొని - రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు ధీటైన స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇక్క‌డ విజ‌యం సాధించి టీఆర్ ఎస్‌ కు తామే ప్ర‌త్యామ్నాయం అనే సంకేతాలు ఇవ్వ‌డంతోపాటు- రాష్ట్రంలో బ‌ల‌ప‌డుదామ‌నుకుంటున్న బీజేపీని వెన‌క్కి నెట్ట‌వ‌చ్చ‌ని కాంగ్రెస్ భావిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఉత్త‌మ్ స‌తీమ‌ణి ప‌ద్మావ‌తిరెడ్డికే అధిష్టానం కాంగ్రెస్ టికెట్ ఖ‌రారు చేసింది. దీంతో సొంత పార్టీ అసమ్మ‌తి నేత‌ల‌తో పాటు ఇత‌ర పార్టీల మ‌ద్ధ‌తును కూడగ‌ట్టే ప‌నిలో నిమ‌గ్నం అయ్యారు. మ‌రోప‌క్క బీజేపీ కూడా ఈ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ ఎస్‌ కు తామే ప్ర‌త్యామ్నాయం అని చెప్పుకుంటున్న ఆ పార్టీకి ఈ ఉప ఎన్నిక అత్యంత కీల‌కంగా మారింది. శ్రీక‌ళారెడ్డిని త‌మ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో దింపే అవ‌క‌శాలున్నాయి. ఇక్క‌డ కాంగ్రెస్ - టీఆర్ ఎస్ నుంచి రెడ్డి సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు పోటీలో ఉన్న నేప‌థ్యంలో బీజేపీ నుంచి అదే సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌కు టికెట్ ఇవ్వాల‌ని పార్టీ భావిస్తోంది. నేడో రేపో అభ్య‌ర్థిని అధికారికంగా ప్ర‌క‌టించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

కాగా హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో త‌మ అభ్య‌ర్థిని కూడా పోటీకి నిల‌బెడుతామ‌ని బ‌హుజ‌న లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ ఎఫ్‌) క‌న్వీన‌ర్ మ‌ద్దికాయ‌ల అశోక్ ప్ర‌క‌టించారు. ఈనేప‌థ్యంలోనే గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థుల‌తో నేడు పార్టీ కార్యాల‌యంలో స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. మొత్తానికి అన్ని పార్టీలు ఉప హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ను అత్యంత కీల‌కంగా భావిస్తూ.. వ్యూహాలు - ప్ర‌తివ్యూహాలు ర‌చిస్తుండ‌టంతో పొలిటిక‌ల్ హీట్ క్ర‌మంగా పెరుగుతంది. గ‌త యేడాది కాలంగా వ‌రుస ఎన్నిక‌ల‌తో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతుండ‌గా ఇప్పుడు హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక ఆ వాతావ‌ర‌ణాన్ని కంటిన్యూ చేస్తోంది.