Begin typing your search above and press return to search.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక పైనే తెలంగాణ భవిష్యత్

By:  Tupaki Desk   |   19 Oct 2019 12:07 PM GMT
హుజూర్ నగర్ ఉప ఎన్నిక పైనే తెలంగాణ భవిష్యత్
X
తెలంగాణ స్వరూపాన్ని మార్చేది.. భవిష్యత్ ను నిర్ణయించేది హుజూర్ నగర్ ఎన్నిక అని.. ఇక్కడి ప్రజల ఓటర్ల తీర్పే తెలంగాణ కు దశాదిశను నిర్ధేశిస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యపేటలో విలేకరులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి పలు హాట్ కామెంట్స్ చేశారు. ఆర్టీసీ సమ్మెతో సహా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో హుజూర్ నగర్ తీర్పు గొప్ప గుణపాఠంగా టీఆర్ఎస్ కు మారబోతోందని అయన అన్నారు.

ఆర్టీసీ సమ్మెకు కేసీఆరే కారణమని.. రెండో దఫా ఆయన పాలన పడకేసిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆర్టీసీ పై కేసీఆర్ మాట తప్పారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ 85వేల కోట్లను తాబేదార్ల కు కట్టబెట్టడానికి కేసీఆర్ ఆర్టీసీని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులను డిస్మిస్ చేసే అధికారం కేసీఆర్ కు లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ రెండో దఫా పాలన రాచరికాన్ని తలపిస్తోందని రేవంత్ మండిపడ్డాడు. కేసీఆర్ నియంతృత్వాన్ని, నిర్భంధాన్ని అణిచివేయాలంటే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చాడు. తెలంగాణ భవిష్యత్ ను ఈ ఎన్నికలే మార్చి వేస్తాయని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ లో విభేదాలు లేవని.. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని.. తమ అక్క పద్మావతిని గెలిపించుకుంటామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ లో ఓడిపోతే నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.