Begin typing your search above and press return to search.

ఆర్టీసీ కార్మికుల్ని వణికిస్తున్న హుజూర్ నగర్ ట్రెండ్స్

By:  Tupaki Desk   |   22 Oct 2019 4:36 AM GMT
ఆర్టీసీ కార్మికుల్ని వణికిస్తున్న హుజూర్ నగర్ ట్రెండ్స్
X
రాజకీయం ఎంత సిత్రంగా ఉంటుందన్న విషయం గడిచిన మూడు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఓపక్క హుజూర్ నగర్ ఉప ఎన్నికకు కేవలం రెండు రోజుల ముందు.. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన సకల జనుల సమ్మె పాజిటివ్ గా సాగటం.. స్పందన కూడా బాగుండటంతో నిరసనలతో సర్కారు మెడలు వంచటం ఖాయమన్న ధీమా ఆర్టీసీ జేఏసీ వర్గాల్లో వ్యక్తమైంది.

దీనికి భిన్నంగా గులాబీ బ్యాచ్ లో విపరీతమైన ఆందోళన.. టెన్షన్ నెలకొన్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఈ సీన్ మొత్తం మారిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 52.89 శాతం ఓట్లు పోలు అయ్యాయో.. భారీగా పోలింగ్ సాగుతుందన్న విషయంతో పాటు.. అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు పోల్ అయినట్లుగా నిర్దారణకు వచ్చారు. అనుకున్నట్లే పోలింగ్ ముగిసే సమయానికి ఏకంగా 84.75 శాతం ఓట్లు పోల్ కావటంతో టీఆర్ ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి సుడి తిరిగిపోయినట్లేనని చెబుతున్నారు. ఎందుకంటే.. ఓటమి అంచున ఉన్నట్లు సాగిన విశ్లేషణలకు భిన్నంగా భారీ మెజార్టీతో గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

పోలింగ్ కు రోజు ముందు వరకూ కూడా హుజూర్ నగర్ ఎన్నిక ఫలితం అధికారపక్షాన్ని ఇబ్బంది పెట్టేలా ఉంటుందని.. అదే జరిగితే తమ సమ్మె విషయంలో కేసీఆర్ మెట్టు దిగటమే కాదు.. సంధికి వస్తారని అంచనా వేశారు. దీంతో.. ఆర్టీసీ కార్మికులు సైతం పట్టుదలతో ఉన్నారు. ఎప్పుడైతే హుజూర్ నగర్ ఉప ఎన్నిక అధికార టీఆర్ ఎస్ కు అనుకూలంగా ఉందన్న విషయంపై క్లారిటీ వచ్చేసిందో.. అప్పటి నుంచి ఆర్టీసీ కార్మికులకు షాకింగ్ గా మారిందంటున్నారు.

హుజూర్ నగర్ ఒత్తిడిలోనే మొండిగా వ్యవహరించిన ముఖ్యమంత్రి.. ఫలితం సానుకూలమన్న విషయంపై స్పష్టత వచ్చాక.. ఆయన మరింత కఠినంగా వ్యవహరించటం ఖాయమంటున్నారు. దీనికి హుజూర్ ఉప ఎన్నిక ఫలితంపై వెలువడిన ఎగ్జిట్ ఫలితాలన్ని టీఆర్ ఎస్ గెలుపు ఖాయమన్న విషయాన్ని ఝూడీ చేయటాన్ని మర్చిపోకూడదు. మొత్తంగా ఆర్టీసీ కార్మికుల్ని హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ వణికిస్తున్నాయని చెప్పక తప్పదు.