Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేగా పోటీకి రూ.30 కోట్లు రెఢీ చేసుకోవాలా?

By:  Tupaki Desk   |   27 Oct 2019 4:59 AM GMT
ఎమ్మెల్యేగా పోటీకి రూ.30 కోట్లు రెఢీ చేసుకోవాలా?
X
నువ్వానేనా అన్నరీతిలో పోటాపోటీగా సాగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అంతిమంగా అధికార పార్టీ సైతం ఊహించని రీతిలో అద్భుతమైన విజయం సొంతం కావటం తెలిసిందే. ఎంతకూ కొరుకుడుపడని హుజూర్ నగర్ కోటలో గులాబీ జెండా పాగా వేయటం ఒక ఎత్తు అయితే.. గులాబీ కారు స్పీడ్ కు పాత రికార్డులన్ని బ్రేక్ అయిపోయి.. మెజార్టీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేయటం తెలిసిందే.

హుజూర్ నగర్ ఫలితంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడ్ ను ఎంతగా మార్చిందన్న విషయాన్ని.. ఫలితం వెల్లడైన సాయంత్రం సుదీర్ఘంగా సాగిన ఆయన ప్రెస్ మీట్ చెప్పేయగా.. ఆయనెంత సంతోషంగా ఉన్నారన్నది హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాటల్ని విన్నోళ్లకు అర్థమయ్యేలా చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పునకు తెర తీసినట్లు చెబుతున్నారు.

గత ఏడాది ఇదే సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ లేని రీతిలో భారీగా ఖర్చు అయిన విషయం తెలిసిందే. సరాసరిన రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వారు ఖర్చు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి ఖర్చు తక్కువలో తక్కువ రూ.30 కోట్ల వరకూ ఖర్చు చేశారన్న మాట వినిపిస్తోంది. అధికారికంగా ఈ ఖర్చు లెక్క చెప్పటం సాధ్యం కాదు కానీ.. ఎన్నికల్ని దగ్గర నుంచి చూసిన వారు.. అధికార పక్షానికి చెందిన నేతలు కొందరు హుజూర్ నగర్ ఖర్చుపై తమ అంతర్గత సంబాషణల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెట్టే ఖర్చుకు హుజూర్ నగర్ ఉప ఎన్నిక రానున్న రోజుల్లో ఒక ల్యాండ్ మార్క్ గా మారుతుందని.. ఎన్నికల ఫలితాల్ని డబ్బు ప్రభావితం ఎలా చేస్తుందన్న దానికి నిదర్శనంగా ఈ ఎన్నికను చెప్పక తప్పదంటున్నారు. అయితే.. పార్టీ నుంచి వచ్చే నిధులు కానీ.. సొంతంగా భారీ ఖర్చుకు వెనుకాడని వారు మాత్రమే రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలు.. ఎంపీలు అయ్యే అవకాశం ఉందన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ పెరుగుతున్న ఎన్నికల ఖర్చుతో రాజకీయం రంగు.. రుచి మొత్తంగా మారతుందన్న మాట వినిపించటం గమనార్హం.